
వెండి తెర నటీమణులు తమ వయసును దాచుకోవాలి. వయసును దాచాలంటే జుట్టుకు రంగు వేయాల్సిందే. అయితే బహుశా దేశంలో జుట్టుకు రంగు వేయడం మానేసిన తొలినటి రత్నా పాఠక్. స్త్రీ ఏ రంగంలోనైనా రాణించాలంటే రూపం కంటే కూడా ప్రతిభ, శరీరానికి ఇచ్చే తర్ఫీదు, దృష్టి ముఖ్యమని అంటారామె. రంగు వేయడం మానేశాక అవకాశాలు తగ్గినా వయసును యాక్సెప్ట్ చేయడంలో స్థిమితం ఉందంటున్నారామె. తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...
‘నేను నటిగా కెరీర్ మొదలైన రోజుల్లో స్త్రీలకు వయసు ఉన్నంత కాలమే పాత్రలు ఉంటాయి. తర్వాత వారు తెరమరుగు అవడమే అనుకునేదాన్ని. కాని నన్ను నటిగా కలకాలం నిలబెట్టేది నా నటనా నైపుణ్యమే తప్ప రూపం, వయసు కావు అని అర్థం కావడానికి చాలా కాలం పట్టింది’ అంటారు రత్న పాఠక్.
బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ తెలిసిన దీనా పాఠక్ కుమార్తె రత్న పాఠక్ టీవీ, సినిమా రంగంలో పని చేస్తున్నారు. ఆమె నటించిన ‘సారాభాయ్ వెర్సస్ సారాబాయ్’ టీవీ సీరియల్ విశేష ఆదరణ పొందింది. ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’. ‘థప్పడ్’,‘ధక్‌ధక్’ సినిమా ల్లో ఆమె నటన అందరికీ గుర్తుంటుంది. సుప్రియ పాఠక్, రత్న పాఠక్ అక్కచెల్లెళ్లు. నసీరుద్దిన్ షాను వివాహం చేసుకున్న రత్నపాఠక్ విలక్షణమైన పాత్రలతో దేశ విదేశాల్లో అవార్డులెన్నో పొందారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, స్త్రీల గురించి మాట్లాడారు.
ఆడపిల్లలే: ‘మా అమ్మ దీనా పాఠక్‌కు మేము ఇద్దరమే ఆడపిల్లలం. మా నానమ్మ మా ఇద్దరినీ చూసి– పాఠక్ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే మగ నలుసే లేదే అని నెత్తి కొట్టుకునేది. అయితే నేను, సుప్రియా నటనా రంగంలో రాణించి పాఠక్ వంశ ఘనతను కాపాడాం. మా అమ్మ, నాన్న ఫలానాది చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆడపిల్ల అనే కారణాన అడ్డుకోలేదు.
చదువులో, కెరీర్‌లో ఎంత దూరం వెళ్లగలిగితే అంత దూరం వెళ్లనిచ్చారు. చిన్నప్పటి నుంచి మాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. మా నాన్న ఢిల్లీ నుంచి కార్లు తెచ్చి ముంబై లో అమ్మేవారు. ఆయన కార్ల కోసం బయలుదేరినప్పుడల్లా మేము కూడా వెళ్లేవాళ్లం. ఆ ప్రయాణాలు కూడా మాకు మంచి చదువును ఇచ్చాయి’ అంటారామె. నటన అంటే: ‘నటనలో నాకు గురువు మా అమ్మ. అయితే ఆమె ప్రతిభకు తగ్గ పాత్రలు రాలేదనే అనుకుంటాను.
నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో మూడేళ్లు నటన నేర్చుకున్నాను. ఒక నటికి కావాల్సింది మనసును, మెదడును డైలాగ్‌కెలా సిద్ధం చేయాలో తెలియడమే. మంచి రూపం బోనస్ కావచ్చు కాని అదే నటనకు అర్హత కాదు. మంచి నటి తన శరీరాన్ని కూడా ఎక్స్‌ప్రెసివ్‌గా మారుస్తుంది. ఆంగికాభినయం ముఖ్యం. నటి అందంగా కంటే దృఢంగా ఉండాలి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను శరీరాన్ని మరింత దృఢంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం చేశానని. నటులకు ఈ నిర్లక్ష్యం పనికి రాదు’. అని చెప్పారు రత్నా పాఠక్.
జుట్టుకు రంగు మానేశాక: ‘నటీమణులు తెల్లజుట్టులో కనిపించడానికి ఇష్టపడరు. నేనూ ఇష్టపడను. కాని తలకు రంగు వేయడం అనేది ఒక ప్రహసనం. రంగు వేసి వేసి శారీరక ధర్మాల నుంచి ఎంతకాలం దూరం వెళ్లగలం అనిపించింది. నసీరుద్దీన్ షా కూడా రంగు మానేసి చూడు... నిన్ను నీలా యాక్సప్ట్ చెయ్ హాయిగా ఉంటుంది అని ప్రోత్సహించాడు. రంగు మానేశాను.
తెల్లటి జుట్టుతో కనిపిస్తుంటే ముందు మార్కెట్ పోతుంది... నాక్కూడా పోయింది. ఎందుకంటే నాతో నటించే నా వయసు మగ నటులు కూడా రంగు వేసుకుంటున్నారు. అయినా సరే నాకొచ్చే పాత్రలు నాకొచ్చాయి. నేను రంగు నుంచి స్వేచ్ఛ పొందాను. మనకు ప్రతిభ ఉంటే రూపం అడ్డు నిలవదు.
ఆధునికత అంటే ఎదుటివారిని ఎలా చూస్తున్నావు, ఎలా అర్థం చేసుకుంటున్నావు అనే సంస్కారం పెరగడమే. అలాగే ఈ కాలపు కుర్రకారు మాటలు అప్పుడప్పుడు చెవిన పడుతుంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి మాటలో బూతులు మాట్లాడుతున్నారు. ఇది ఆధునికత అయితే నాకు గతకాలమే మేలు అనిపిస్తుంది. కాసింత మర్యాద, గౌరవం, పద్ధతీ పాడూ వద్దా ఈ కాలం పిల్లలకు?’ అని ముగించారామె.
(చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..)