మూడేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యా
ముంబై టీమ్ యాజమాన్యం అండగా నిలిచింది.
భారత క్రికెటర్ తిలక్ వర్మ మనోగతం
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఇప్పుడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఒక సంచలనం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున పలు మార్లు తన ఆటతో ఆకట్టుకున్న అతడికి ఇటీవలి ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ జాతీయ హీరోగా మారాడు. అయితే మూడేళ్ల క్రితం తన జీవితంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం గురించి అతను మొదటిసారి వెల్లడించాడు.
ముంబై ఇండియన్స్‌కు ఒక సీజన్‌లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత తాను అనారోగ్యానికి గురి కావడం... ముంబై యాజమాన్యం తనకు అండగా నిలిచిన విషయాన్ని అతను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై జట్టుకు నాలుగు సీజన్లుగా (2022 నుంచి) తిలక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలి ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత తాను కండరాలకు సంబంధించిన ‘రాబ్డోమయాలసిస్’ వ్యాధి బారిన పడ్డానని తిలక్ చెప్పాడు. అది చాలా ప్రమాదకరమైనదని, తన కండరాలు బిగుసుకుపోవడంతో దాని తీవ్రత తెలిసిందని అతను అన్నాడు.
‘ఆ సమయంలో నేను టెస్టు జట్టులో స్థానం దక్కించుకునే ప్రయత్నంలో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాను. ఫిట్‌గా ఉండే ప్రయత్నంలో అవసరానికి మించి ట్రైనింగ్‌లో పాల్గొనేవాడిని. విశ్రాంతి రోజుల్లో కూడా జిమ్‌లోనే గడిపాను. శరీరం కోలుకునేందుకు తగిన సమయం ఇవ్వకుండా దీనిని కొనసాగించాను. చివరకు అది ప్రతికూల ప్రభావం చూపించింది. నా కండరాలు సరిగా పని చేయలేదు.
భారత ‘ఎ’ జట్టు తరఫున బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన తర్వాత కళ్లు, చేతి వేళ్లు సరిగా పని చేయలేదు. శరీరమంతా రాయిలాగా మారినట్లు అనిపించింది. ఆ మ్యాచ్ నుంచి రిటైర్‌హర్ట్‌గా బయటకు వచ్చాను. వేళ్లలో కదలిక లేకపోవడంతో చేతి గ్లవ్స్‌ను కత్తిరించాల్సి వచి్చంది’ అని తిలక్ నాటి పరిస్థితిని వివరించాడు. అయితే తన ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించి వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేశారని తిలక్ కృతజ్ఞతలు చెప్పాడు.
‘వారిద్దరి చొరవతో వెంటనే నన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో నా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. శరీరంలోకి గుచ్చిన సూది కూడా విరిగిపోయింది. కొన్ని గంటలు ఆలస్యమై ఉంటే పరిస్థితి చేయిదాటిపోయేదని, చనిపోవడానికి కూడా అవకాశం ఉండేదని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో మా అమ్మ నాతోనే ఉంది’ అని తిలక్ భావోద్వేగంతో చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఈనెల 29 నుంచి మొదలయ్యే ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం కెపె్టన్ సూర్యకుమార్, శివమ్ దూబే, బుమ్రాలతో కలిసి తిలక్ వర్మ ఆ్రస్టేలియాకు బయలుదేరి వెళ్లాడు.
ఆసియా కప్ ట్రోఫీ మాయం!
భారత జట్టు విజేతగా నిలిచిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం మరో మలుపు తిరిగింది. ఫైనల్ తర్వాత ట్రోఫీని భారత జట్టు అందుకోకపోగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆదేశాల మేరకు దానిని దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచారు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కూడా దానిని తరలించినట్లు తెలుస్తోంది. దానిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
బీసీసీఐ అధికారి ఒకరు ఇటీవల ఏసీసీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ట్రోఫీ కనిపించలేదు. దీనిపై అక్కడి ఉద్యోగులను విచారించగా...అబుదాబిలో ఉన్న నఖ్వీ తన వద్దనే ట్రోఫీని ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజున భారత ఆటగాళ్లంతా ట్రోఫీని ఎప్పుడైనా తీసుకురావచ్చంటూ 40 నిమిషాల పాటు ఎదురు చూశామని...ఆ తర్వాతే అసలు విషయం తెలియడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు జరుపుకున్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు.


