అభిషేక్ శర్మ.. టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు దొరికిన అణిముత్యం. గతేడాది టీ20 దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన అభిషేక్.. తన ఐపీఎల్ దూకుడును అంతర్జాతీయ వేదికపై కూడా కొనసాగిస్తున్నాడు.
ఈ పంజాబ్ బ్యాటర్ అతి తక్కువ కాలంలోనే టీ20ల్లో వరల్డ్ నంబర్ బ్యాటర్‌గా ఎదిగాడు. యువరాజ్ సింగ్ వంటి లెజెండ్ కోచింగ్‌లో రాటుదేలిన అభిషేక్ టీ20ల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొదటి బంతి నుంచే భారీ షాట్ల ఆడే సత్తా అతడిది. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు.
పరుగుల సునామీ..
అభిషేక్ శర్మ గతేడాది జింబాబ్వేతో సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన అరంగేట్ర సిరీస్‌లోనే 183.33 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 2024 ఏడాదిలో 11 ఇన్నింగ్స్‌లలో 23.27 సగటుతో 256 పరుగులు చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 171.81 ఉంది. మెరుగ్గా రాణించకపోయినప్పటికి తనకు పవర్ హిట్టింగ్ స్కిల్స్ కారణంగా టీమ్ మెనెజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది.
దీంతో మెనెజ్‌మెంట్ నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకున్నాడు. 2025 ఏడాదిలో పరుగులు సునామీ సృష్టించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ దాదాపుగా తన బ్యాట్‌కు పనిచెబుతున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 790 పరుగులు చేశాడు. అతడి తర్వాతి స్ధానంలో తిలక్ వర్మ(468) ఉన్నాడు.
కోహ్లి రికార్డుపై కన్ను..
ఈ డేంజరస్ బ్యాటర్ ఇప్పుడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ)లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు అభిషేక్ చేరువయ్యాడు.
ఆదివారం సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో 81 పరుగులు చేస్తే ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంటాడు. అభిషేక్ ఇప్పటివరకు ఈ ఏడాది టీ20ల్లో 41.43 సగటుతో 1514 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. 2016లో కోహ్లి ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌తో కలిపి టీ20ల్లో 1614 పరుగులు చేశాడు.
ఇప్పుడు ఈ సౌతాఫ్రికా సిరీస్ ముగిసేలోపు కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు శర్మ బద్దలు కొట్టడం ఖాయం. అభిషేక్ ఐపీఎల్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ-2025లోనూ దుమ్ములేపాడు. అయితే అభిషేక్ సఫారీలతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంకా తన విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. అదేవిధంగా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో వంద టీ20 సిక్స్‌లు పూర్తి చేసుకున్న ఏకైక భారత ఆటగాడిగా కూడా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.
విరాట్ కోహ్లి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 125 మ్యాచ్‌లు ఆడి 4188 పరుగులు చేయగా.. అభిషేక్ ఇప్పటివరకు 31 మ్యాచ్‌లలో 1046 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి టీ20 కెరీర్‌లో 13543 పరుగులు ఉండగా .. అభిషేక్ 4849 రన్స్ చేశాడు.
చదవండి: IPL 2026: కేకేఆర్ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?


