ఏఐ యుగంలో ఏం నేర్చుకుంటే సేఫ్‌? | AI Era Careers: Abhijit Bhadhuri’s Advice for Students and Job Seekers | Sakshi
Sakshi News home page

ఏఐ యుగంలో ఏం నేర్చుకుంటే సేఫ్‌?

Oct 27 2025 11:39 AM | Updated on Oct 27 2025 2:44 PM

Microsoft former HR Head Abhijit bhaduri Interview

ఏఐ యుగంలో ఈ సంసిద్ధత ఎంతో ఆవశ్యకం

ఐక్యూతోపాటు ఈక్యూను కూడా పెంచుకోవాలి

ప్రముఖ కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ నిపుణులు, విప్రో మాజీ సీఎల్‌వో, మైక్రోసాఫ్ట్‌ హెచ్‌ఆర్‌ మాజీ హెడ్‌ అభిజిత్‌ భాదురి

మారుతున్న కాలంతోపాటు.. అన్ని రంగాల్లో కొత్త టెక్నాలజీలు ఆవిష్కృతం అవడం సహజం. దీన్ని అందిపుచ్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలే తప్ప.. కొత్త సాంకేతికతలతో కెరీర్‌ మనుగడ ప్రశ్నార్థకం అనే ఆందోళన చెందడం సరికాదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగంలో ఎంట్రీ లెవల్‌ నుంచి సీనియర్‌ ఎక్జిక్యూటివ్స్‌ వరకు నిరంతర అధ్యయనం అలవర్చుకోవాలి.’ అంటున్నారు.. ప్రముఖ కార్పొరేట్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ నిపుణులు, విప్రో టెక్నాలజీస్‌ మాజీ చీఫ్‌ లెర్నింగ్‌ ఆఫీసర్, మైక్రోసాఫ్ట్‌ ఇండియా హెచ్‌ఆర్‌ మాజీ జీఎం అభిజిత్‌ భాదురి.

ఆయన తన శిక్షణతో ఎందరో మేనేజర్లను తీర్చిదిద్దడమే కాకుండా.. అంతర్జాతీయంగా బెస్ట్‌ రిక్రూటింగ్‌ కన్సల్టెంట్స్‌ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సెల్వేనియా అందిస్తున్న చీఫ్‌ లెర్నింగ్‌ ఆఫీసర్స్‌ ప్రోగ్రామ్‌ అడ్వయిజరీ బోర్డ్‌ మెంబర్‌గా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆధునిక యుగంలో కొలువుల్లో సాంకేతికపై ‘డిజిటల్‌ సునామీ’ పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా, ఆథర్‌గా, బెస్ట్‌ రిక్రూటర్‌గా గుర్తింపు పొందిన అభిజిత్‌ భాదురితో ఈ వారం ఇంటర్వ్యూ.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్థులు ఆందోళనలేకుండా ఎలా సంసిద్ధంగా ఉండాలి?

ఆధునిక ప్రపంచంలో.. ఏఐ యుగంలో.. పోటీ వాతావరణంలో యువత అకడమిక్స్‌లోనైనా, కెరీర్‌ పరంగానైనా సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే సక్సెస్‌ సొంతమవుతుంది. సమస్య తీవ్రత చూసి ఆందోళన చెందకూడదు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని గమనించాలి. దానికి మార్గాలు ఏంటి? అని ఆత్మ విశ్లేషణ చేసుకుంటే ఆందోళన వీడుతుంది. ముఖ్యంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనను వీడి.. ఆ టెక్నాలజీ ద్వారా లభించే కొత్త ఉద్యోగాలు, ప్రొఫైల్స్‌ను అందుకునే ప్రయత్నం చేయాలి.

జాబ్‌మార్కెట్‌లో కుదురుకునేందుకు విద్యార్థులు అకడమిక్‌గా ఏయే అంశాలపై దృష్టిసారించాలి?

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్స్‌లో అడుగు పెట్టిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్‌ లెర్నింగ్‌ దృక్పథం అలవర్చుకోవాల్సిందే. స్కూల్‌ లెవల్‌లో ఉన్నట్లు స్పూన్‌ ఫీడింగ్‌ ఉంటుందని భావించొద్దు. నేటితరం విద్యార్థులకు ఏ రంగానికి సంబంధించైనా చిటికెలో విస్తృత సమాచారం లభిస్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అయితే ఇదే సమయంలో కనిపించిన ప్రతి అంశాన్ని చదివితే సమయం వృథా. అందుకే సెల్ప్‌ లెర్నింగ్‌ ట్రిక్స్‌ ఫాలో అవ్వాలి. లెర్నింగ్‌ లేదా సెల్ఫ్‌ లెర్నింగ్‌ అంటే.. ఏదైనా ఒక అంశం గురించి క్లాస్‌ రూంలో బోధిస్తున్నప్పుడు సరైన ప్రశ్న అడగడం లేదా అందుబాటులో ఉన్న సమాచారంలో సరైన అంశాన్ని గుర్తించడమే. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు నిర్దిష్టంగా ఒక అంశాన్ని క్లాస్‌ రూంలో వినకపోవడం వల్ల సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. ఇది అంతిమంగా వారి కెరీర్‌పై ప్రభావం చూపుతోంది.

ఉద్యోగార్థులు అకడమిక్స్‌తోపాటు దృష్టి సారించాల్సిన అంశాలేవి?

ప్రస్తుతం వ్యాపార రంగం విభిన్న నైపుణ్యాలున్న స్పెషలిస్ట్‌ల కోసం అన్వేషిస్తోంది. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తులను విస్తృతం చేసుకోవాలి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌ లేదా ప్రోగ్రామ్‌కే పరిమితం కాకుండా విభిన్న డిసిప్లైన్స్‌ అభ్యసించాలి. ప్రతి ఏటా కొత్త నైపుణ్యాలు పొందేలా తమను తాము మలచుకోవాలి. అంతేకాకుండా కెరీర్‌లో ప్రతి దశలోనూ మంచి మెంటార్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా సుదీర్ఘ కాలం సుస్థిరత లభిస్తుంది.

విద్యార్థులు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కుంగుబాటుకు గురవుతున్నారు? దీనికి మీరు సూచించే పరిష్కారం?

యువత ఆసక్తిని పెంచుకోవడంతోపాటు.. శరవేగంగా మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇక ఉద్యోగం, కెరీర్‌ ఎంపికలో తమ బలాలు, బలహీనతలు గుర్తించి తమ సామర్థ్యాలకు సరితూగే సంస్థలు/ఉద్యోగం పొందేందుకు కృషి చేయాలి. ఒక అవకాశం చేజారినా నిరుత్సాహం చెందకూడదు. అది ఎందుకు చేజారిందనే ఆత్మవిశ్లేషణ చేసుకుని ఆ సమస్య పునరావృతం కాకుండా చూసుకుంటే అంతా సవ్యంగా సాగుతుంది.

యువత మానసికంగా దృఢంగా ఉండటానికి ఏ లక్షణాలను అలవర్చుకోవాలి?

విద్యార్థులు ఐక్యూ లెవల్స్‌ను పెంచుకోవడంతోపాటు.. ఎమోషనల్‌ కోషియంట్‌ ఈక్యూ (భావోద్వేగ ప్రజ్ఞ) లెవల్స్‌ను పెంచుకునేలా కృషి చేయాలి. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో.. కెరీర్‌ లక్ష్యాలు చేరుకునే క్రమంలో.. విధుల్లో ఉన్నత స్థానాలు అధిగమించే క్రమంలో మానసిక ఉద్విగ్నతలను సమతూకంలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీనికి ప్రధాన సాధనం ఈక్యూ. కెరీర్‌లో విజయాలు సాధించాలంటే ఎమోషనల్‌ కోషియంట్‌దే ప్రధాన పాత్ర అని పలు సందర్భాల్లో రుజువైందని తెలుసుకోవాలి.

ప్రస్తుత జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా కరిక్యులం ఉందా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ కార్యకలాపాలు ఆరేడు నెలలకోసారి.. కొత్త పుంతల్లో వెళుతున్నాయి. దీనికి అనుగుణంగా క్లాస్‌ రూంలో బోధన కుదరట్లేదు. కాబట్టి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ తదితర ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్స్‌లో కరిక్యులం మార్పులు చేయాలి. పూర్తి స్థాయిలో ఇది క్లిష్టమైతే ఇండస్ట్రీ వర్గాల భాగస్వామ్యంతో క్లాస్‌ రూమ్‌ టీచింగ్‌ ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు ఇండస్ట్రీ వాస్తవ పరి­స్థితులపై అవగాహనతోపాటు.. రియల్‌టైమ్‌ నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది.

నియామక పద్ధతుల్లోని మార్పులపై మీ అభిప్రాయం ఏంటి?

ప్రస్తుతం లేటెస్ట్‌ టెక్నాలజీలకు అనుగుణంగా.. వాటిలో పట్టు ఉన్న వారిని గుర్తించడం, హైరింగ్‌ చేసుకోవడం హెచ్‌ఆర్‌ నిపుణులకు కూడా కష్టంగానే మారుతోంది. ఇదే కారణంగా ఇంటర్వ్యూలలో టెక్నికల్‌ రౌండ్స్‌ క్రమేణా పెరుగుతున్నాయి. టెక్నికల్‌ టీమ్‌ మదింపు ఆధారంగా హెచ్‌ఆర్‌ టీమ్‌ ఆఫర్స్‌ ఖరారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ ఏఐ ప్రమేయాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికే విదేశాల్లో ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మన దేశంలోనూ త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, జాబ్‌ సీకర్స్‌ ఏఐ ఆధారిత ఇంటర్వ్యూల సరళిపై ఇప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకోవాలి.

ఏఐ కారణంగా ఫ్రెషర్స్‌కు అవకాశాలు తగ్గుతాయా?

ఏఐ విప్లవం నేపథ్యంలో ప్రెషర్స్‌ నియామకాలు తక్కువగా ఉంటాయి.. క్యాంపస్‌ డ్రైవ్స్‌ ఉండవు అనే మాటను అంగీకరించను. ఎందుకంటే.. కంపెనీలకు ఫ్రెష్‌ మైండ్స్‌ దొరికేది క్యాంపస్‌లలోనే. ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటే తమ ప్రణాళికలు, తమ కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చనే భావన ఇప్పటికీ కార్పొరేట్‌ వర్గాల్లో సజీవంగా ఉంది. అందువల్ల విద్యార్థులు క్యాంపస్‌ డ్రైవ్స్‌లో రాణించేలా.. లేటెస్ట్‌ టెక్నాలజీస్, మార్పులపై అవగాహన ఏర్పరచుకుని.. క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావాలి. మరోవైపు విద్యార్థులు క్లాస్‌లో టాపర్స్‌తో పోల్చుకోకుండా తమకున్న టాలెంట్‌కు సరితూగే సంస్థలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు కెరీర్‌లో నిరాశకు గురికాకుండా.. తప్పనిసరిగా సక్సెస్‌ అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement