కొన్నిసార్లు కళ్లతో చూస్తున్నా నమ్మశక్యంగా ఉండదు. ఇంటర్వ్యూకు హాజరైన ఒక అభ్యరి్థకి అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ సంస్థలో ఉద్యోగం కోసం అతను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కాల్‌లో చేరాడు. స్క్రీన్‌పై చిరునవ్వుతో కూడిన మహిళ కనిపించింది.. కాదు కాదు రోబో సినిమానే చూపించింది. ‘నా ప్రాణం నువ్వే.. నా సర్వస్వం నువ్వే...’అని రోబో సినిమాలో పాడే యంత్రుడిలా... ఆమె తీరు, ఆమె ప్రతిస్పందనలు పూర్తిగా యాంత్రికంగా అనిపిస్తుంటే అభ్యర్థి విస్తుపోయాడు.
చెమటలు పట్టిన అభ్యర్థి
మొదట్లో అంతా సాధారణంగానే అనిపించినా.. నిమిషాలు గడిచే కొద్దీ అభ్యర్థికి భయం మొదలైంది. ‘రెడ్డిట్’అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఆ యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశాడు.. ‘ఆమె తల ఊపు ఒక లూప్‌లో ఉన్నట్లు అనిపించింది. ప్రతి రెండు సెకన్లకు చిన్న చిన్న కదలికలు కనిపించాయి’.. అని వివరించాడు.
ఠారెత్తించిన ‘రోబో భామ’
‘రోబో’ సినిమాలోని చిట్టి రోబో నవ్వినట్లు.. మాట్లాడినట్లు ఇంటర్వ్యూ చేసిన ఆ మహిళ స్పందనల్లో ఎక్కడా మానవ సహజమైన తడబాటు లేదు. విరామం అసలే లేదు. ప్రశ్న ఏదైనా సరే.. సమాధానం ‘డేటాబేస్ నుండి తీసినట్లు.. దోషరహితంగా’ వస్తుంటే.. అభ్యర్థి నోటమాట రాలేదు. లోపల ఏఐ ఉండి, బయట మనిషిలా నటిస్తున్న ఈ ఇంటర్వ్యూయర్ తీరు ఆ అభ్యర్థికి నిద్ర పట్టనివ్వలేదు.
తడబడకుండా సమాధానాలు
ఎదురుగా ఉన్నది మనిషి కాదని దాదాపు నిర్ధారించుకున్న అభ్యర్థి, ఆ రోబోను పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. ‘ఈ పోస్ట్ ఎందుకు ముఖ్యమో మీరు చెప్పగలరా?’అని ఎదురు ప్రశ్నించాడు. వెంటనే పాఠ్యపుస్తకంలో ఉన్నట్లుగా పర్ఫెక్ట్‌గా సమాధానం వచ్చింది. మళ్లీ అదే ప్రశ్న అడిగితే.. అదే సమాధానం.. ఒక్క పదం కూడా మారకుండా తిరిగి వచ్చింది!అంతలోనే, స్క్రీన్ కొద్ది క్షణాలు స్తంభించింది. తిరిగి తెర తెరుచుకోగానే, రోబో భామ ఏమీ జరగనట్లుగా, ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే సంభాషణను కొనసాగించింది! రోబోకు ఉన్న బ్యాకప్ ప్లాన్ లేదా ఫాల్ట్ రికవరీ సిస్టమ్ లాగా ఆ దృశ్యం అభ్యర్థిని వణికించింది.
చెప్పకపోవడం నైతికమేనా..
తనకు ఎదురైన ఈ వింత అనుభవంపై అభ్యర్థి లేవనెత్తిన ప్రశ్న ఒక్కటే.. ‘ఏఐ బోట్ అని అభ్యర్థికి చెప్పకపోవడం నైతికంగా సరైనదేనా?’.. ఈ కథనం సోషల్ మీడియాలో భారీ చర్చకు తెర లేపింది. నేటి ఉద్యోగార్థులు తాము మా ట్లాడేది మనిషితోనా?, మనిషి రూపంలోని యంత్రంతోనా? అన్న స్పష్టత కోసం పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే కాలంలో మనం ఏఐకి సహచరులుగా ఉంటామా? లేక ఏఐ మనకు యజమాని అవుతుందా? అన్న తీవ్రమైన ప్రశ్న.. నేటి జాబ్ మార్కెట్‌లో ఉత్పన్నమవుతోంది. ఏఐ అని చెప్పకుండా, అభ్యర్థుల సమయాన్ని, ఆశలను వృధా చేయడం నైతికంగా ఎంతవరకు సమంజసం?. ఈ విచిత్ర ఇంటర్వ్యూ కథ.. ఆ చర్చకు పదును పెట్టింది!.
–సాక్షి, నేషనల్ డెస్క్.


