హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 (Hong Kong Sixes) టోర్నమెంట్‌లో అఫ్గానిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం మోంగ్‌కాక్ వేదికగా తొలుత నేపాల్‌ను 17 పరుగుల తేడాతో ఓడించిన అఫ్గాన్.. తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
నైబ్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 148 పరుగులు చేసింది. అఫ్గాన్ కెప్టెన్ నైబ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మోంగ్‌కాక్ మిషన్ రౌండ్ గ్రౌండ్‌లో నైబ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
నైబ్ కేవలం 12 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడితో పాటు మరో సీనియర్ ఆల్‌రౌండర్ కరీం జనత్ కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జనత్ కేవలం 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ప్రోటీస్ బౌలర్లలో బయోమీ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది. జోరిచ్ వాన్ షాల్క్విక్(37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాషీఫ్ జోసెఫ్(22) రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగగా.. జాన్ కన్నింగ్‌హామ్(22) టైమడ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన నైబ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ విధ్వంసం.. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ


