ఇటీవలి కాలంలో ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా లగ్జరీ బ్యాగులు, చెప్పులు,లంచ్‌బాక్స్ ఇలా వివిధ రకాల వింత వింత డిజైన్లలో ఉత్పత్తులను లాంచ్ చేసింది. తాజాగా లగ్జరీబ్రూచ్ (సేఫ్టీ పిన్)ను పరిచయం చేసింది. దీని ధర గురించి తెలుసుకుని జనం షాకవుతున్నారు. అతి సాధారణ పిన్సీసు లాంటి దానికోసం అంత డబ్బు వెచ్చించాలా అని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై తెగ చర్చ జరుగుతోంది.
ప్రాడా అనే సంస్థ ఏకంగా 775 డాలర్లకు (రూ. 68758) విలువతో దీన్ని లాంచ్ చేసింది. సుమారు 3.15 అంగుళాల పొడవులో రంగురంగుల క్రోచెట్ దారంతో రూపొందించిన ఈ బ్రూచ్ మూడు రంగుల కలయికలలో లభిస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. అయితే దుకాణాలలో సాధారణంగా 15 నుండి 20 ప్యాక్‌కు దాదాపు రూ. 10 ఖర్చవుతుంది.69వేల రూపాయలా? నేను దీన్ని చాందిని చౌక్‌లో రూ. 5 కి అదే కొన్నాను మరికొందరు వ్యాఖ్యానించారు. దీన్ని ఏ రంగుతోనైనా తయారు చేయగలను, సేఫ్టీ పిన్ రంధ్రం కోసం బంగారాన్ని కూడా ఉపయోగిస్తాను అని ఒకరు, ఈ డబ్బుతో మొత్తం గదినినింపేసే అన్ని పిన్స్ కొంటాను అని మరొకరు... ఇలా తలా ఒక రకంగా ఈ బ్రూచ్‌ను ఎగతాళి చేశారు.
కాగా లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఆటో మోడల్‌లో బ్యాగ్, రూ. 1.2 లక్షల ధరతో కొల్హాపురి-శైలి చెప్పులను తీసుకురావడం వార్తల్లో నిలిచింది. మహారాష్ట్ర సాంప్రదాయ చేతితో తయారు చేసిన షోలాపురి చెప్పులకు కాపీ అంటూ విమర్శలు చెలరేగాయి. చేతివృత్తులవారికి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తమైంది. ప్రాడా తమ డిజైన్‌ను కాపీ చేసినట్లు ఆరోపిస్తూ భారతీయ కళాకారులకు ద్రవ్య పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయడంతో వివాదం మరింత తీవ్రమైంది.


