తిరువనంతపురం: కేరళలోని పళక్కాడ్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనుమానం ఓ వలస కార్మికుడి ప్రాణం తీసింది. పనికోసం వచ్చిన రామనారాయణ్ భగేల్ దొంగతనం చేశాడని భావించి స్థానికులు కొట్టి చంపారు. కానీ ఆ తర్వాతే అతని నిజాయతి బయటపడింది. రామనారాయణ్ దొంగతనం చేయలేదని అమాయకుడని పోలీసులు నిర్ధారించారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామనారాయణ్ భగేల్ (31) అనే వలస కార్మికుడు. ఇటీవలే కేరళలోని వాలయార్ ప్రాంతానికి పని కోసం వచ్చాడు. ఒక దుకాణం నుంచి ఆహార ప్యాకెట్ దొంగిలించాడని అనుమానంతో స్థానికులు అతనిపై దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన రామనారాయణ్‌ను ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వాలయార్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో రామనారాయణ్ దొంగతనం చేయలేదని, అతని వద్ద ఏమీ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
రామనారాయణ్ ఛత్తీస్‌గఢ్‌లోని సక్తి జిల్లాకు చెందినవాడు. నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తల్లి అతని మీద ఆధారపడి జీవిస్తున్నారు. మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు.


