దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.
సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.
దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?
దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.
దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..
దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.
2026.. కుటుంబ సంవత్సరం
కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.


