ఇల్లినాయిస్‌లోని షామ్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి, 67 ఏళ్ల వృద్ధ తండ్రిని సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపినట్లు ఆరోపణలపై అభిజిత్ పటేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నవంబర్ 29న కుమారుడు చేతిలో హత్యకు గురయ్యాడు.
కేసు ఏంటీ అంటే
అనుపమ్ పటేల్ భార్య ఉదయం డ్యూటీకి వెళ్లిపోయింది. తండ్రీ కొడుకులిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల తన బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి భార్యకు ఫోన్ చేయడం అలవాటు. పైగా అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు కనెక్ట్ అయ్యి ఉంది. హత్య జరిగిన రోజు భర్త నుంచి ఫోన్ రాకపోవడం, అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం గమనించింది. ఫోన్‌లో వారితో సంప్రదించాలని ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఆందోళన ఇంటికి పరుగు తీసింది. ఎదురుగా కనిపించిన కొడుకు నాన్న బాగానే ఉన్నాడులే అని చెప్పాడు. ఏదో అనుమానం వచ్చి తల్లి చెక్ చేయగా, మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి హతాశురాలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారి సాయంతో భర్తను ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఒక పెద్ద సుత్తిని గుర్తించారు పోలీసులు. అనుపమ్ పటేల్ తలకు తీవ్ర గాయాలు, పుర్రె, ముక్కు ఎముక విరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది.
మరోవైపు నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సమయంలో, చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని చెప్పుకొచ్చాడు. అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్, గతంలో చికిత్స కోసం గతంలో ఆసుపత్రిలో చేరినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిజిత్ ఆరోపణలన్నీ భ్రమలు కావచ్చని పోలీసుల అంచనా. దీనికి తోడు గతంలో చాలా సార్లు తండ్రిని చంపేస్తానని బెదరించేవాడట. దీంతో అభిజిత్ తండ్రిని సంప్రదించకుండా చట్టబద్ధంగా నిషేధం 2027 జనవరి వరకు అమల్లో ఉంది. అయితే అతని తల్లిదండ్రులు ఇంట్లో నివసించడానికి అనుమతించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజిత్ పటేల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. అంతేకాదు తల్లిని సంప్రదించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.
చదవండి: భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే..వాళ్లు బతికిపోయారు
రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం


