అడిస్ అబాబా: అడిస్ అబాబా: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో అడుగుపెట్టడం తనకు సొంత గడ్డపై ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా ఆసియా సింహాలకు నిలయం కావడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రసంగించిన 18వ పార్లమెంటుగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇథియోపియా ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రశంసించిన ఆయన, భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఆ దేశానికి స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల జాతీయ గీతాలు ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్ని, దేశభక్తిని ప్రేరేపిస్తాయని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకు ముందు ఆయన ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులను కలుసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశపు అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ జాతీయ గీతం ‘వందేమాతరం’, ఇథియోపియా జాతీయ గీతం రెండూ మాతృభూమిని తల్లిగా అభివర్ణిస్తాయని పేర్కొన్నారు. మన వారసత్వం, సంస్కృతి, ప్రకృతి అందాల పట్ల గర్వపడటమే కాకుండా, దేశాన్ని రక్షించుకునేందుకు ఈ గీతాలు మనల్ని నిరంతరం ప్రేరేపిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
తమకు లభించిన 'గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా' పురస్కారాన్ని భారత ప్రజల తరపున ఎంతో వినయంతో స్వీకరిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, చేతులు జోడించి భారత దేశ గౌరవాన్ని చాటిచెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
#FPLIVE: Indian Prime Minister Narendra Modi addresses a joint session of the Ethiopian Parliament and meets the Indian diaspora residing in the country. https://t.co/ffsFA0mtiq
— Firstpost (@firstpost) December 17, 2025


