రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్‌ పరిస్థితి విషమం | Ludhiana prison riot: Inmatesrampage leaves jail superintendent hospitalised | Sakshi
Sakshi News home page

రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్‌ పరిస్థితి విషమం

Dec 17 2025 12:29 PM | Updated on Dec 17 2025 2:11 PM

Ludhiana prison riot: Inmatesrampage leaves jail superintendent hospitalised

పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో మరోసారి హింస చెలరేగింది.  ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. వీరిని అదుపు చేయడానికి ప్రయత్నించిన జైలు సూపరింటెండెంట్‌  తీవ్ర గాయాల పాలు కావడం మరింత ఆందోళన రేపింది.

మంగళవారం సాయంత్రం లూథియానాలోని తాజ్‌పూర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో రెండు గ్రూపుల ఖైదీల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. జైలు అధికారులు, పోలీసు సిబ్బంది వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఖైదీలు పోలీసు అధికారులపై దాడి చేశారు. ఈక్రమంలో జైలు సూపరింటెండెంట్ కుల్వంత్ సిద్ధూ తలపై ఇటుకతో బలంగా కొట్టడంతో ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే జైలు డిఎస్పీ జగ్జీత్ సింగ్ , కొంతమంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో సహా ఇతర సిబ్బంది కూడా ఇటుకల దాడిలో గాయపడ్డారు. ఖైదీలకు అసలు ఇటుకలు ఎలా వచ్చాయనేది ఆరాతీస్తే, జైలులోని  గార్డెన్‌ బెడ్స్‌ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంబులెన్స్‌లు, అదనపు పోలీసు బలగాలను  భారీగా తరలించారు. ప్రస్తుతం జైలును మూసివేసి పోలీస్ కమిషనర్ స్వపన్ శర్మ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

200 మందికి పైగా ఖైదీలు దాడి
రెండు గ్రూపుల మధ్య గొడవ ఒకవైపు ఇద్దరు, మరోవైపు ముగ్గురుగా ఐదుగురు వ్యక్తుల మధ్య గొడవ మొదలైంది. మత కారణంగా తనను అవమానించారని ఆరోపణలతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఇరు పక్షాలు ఇటుకల విసురుకోవడంతో కొద్దిసేపటికే  పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది.  సుమారు 200 నుండి 250 మంది ఖైదీలు పోలీసులపై దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, సెంట్రల్ జైలు వెలుపల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జైలు ఆవరణలో దాదాపు 20 నిమిషాల పాటు సైరన్లు  మోతతో దద్దరిల్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై జైళ్ల మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్‌ జైలు అధికారుల నుండి నివేదిక కోరారు.  కాగా 2019, జూన్‌లో ఇదే జైలులో  తీవ్ర ఘర్షణ చెలరేగింది.  బ్యారక్‌ల లోపల హింసాత్మక తిరుగు బాటును అణిచి వేసేందుకు పోలీసులు 150 రౌండ్లకు పైగా కాల్పులు జరపవలసి వచ్చింది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement