‘సెవెన్ సిస్టర్స్‌’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్ | MEA Summons Bangladesh High Commissioner Over Dhaka Leader | Sakshi
Sakshi News home page

‘సెవెన్ సిస్టర్స్‌’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్

Dec 17 2025 1:37 PM | Updated on Dec 17 2025 1:37 PM

MEA Summons Bangladesh High Commissioner Over Dhaka Leader

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు బంగ్లాదేశ్‌ వ్యవహరిస్తోంది. తాజాగా భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.

ఢాకాలోని షహీద్ మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో అబ్దుల్లా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించని వారికి భారత్ అండగా నిలిస్తే, తాము కూడా భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాద శక్తులకు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడితే, ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారతదేశానికి కూడా వ్యాపిస్తాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నరికివేసేలా (చికెన్ నెక్ కారిడార్‌ను ఉద్దేశించి) బంగ్లాదేశ్ తన వ్యూహాలను అమలు చేయగలదని అబ్దుల్లా పేర్కొనడం కలకలం రేపింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర  తదితర రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ  నేపధ్యంలో అక్కడ వేర్పాటువాద శక్తులను ప్రోత్సహిస్తామనే బంగ్లాదేశ్‌ హెచ్చరికను భారత్ భద్రతా పరమైన ముప్పుగా భావిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా భారత్ తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అబ్దుల్లా ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్ పట్ల పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అస్థిరతను సృష్టించే శక్తులకు చోటు ఇవ్వొద్దని, బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించాలని భారత్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాయబారికి స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: పుస్తకాల మధ్య ప్రాణవాయువు.. ‘అతుల్’‌ కష్టం ఎవరికీ వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement