సిరీస్‌ సొంతం చేసుకోవాలని... | India plays fourth T20 against South Africa today | Sakshi
Sakshi News home page

సిరీస్‌ సొంతం చేసుకోవాలని...

Dec 17 2025 3:18 AM | Updated on Dec 17 2025 3:20 AM

India plays fourth T20 against South Africa today

నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ నాలుగో టి20

గెలిస్తే టీమిండియా ఖాతాలోకి సిరీస్‌ 

నెగ్గి నిలవాలని దక్షిణాఫ్రికా తహతహ

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం  

స్టార్‌ బ్యాటర్ల వరుస వైఫల్యాలు... కీలక బౌలర్లకు గాయాలు... గైర్హాజరీలు... అయితేనేం జోరు కొనసాగించాలని.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని... సూర్యకుమార్‌ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో భారత జట్టు నాలుగో టి20 మ్యాచ్‌ ఆడనుంది. ఆతిథ్య జట్టులోని ప్రతికూలతల్ని సొమ్ము చేసుకొని లక్నో వేదికను లక్కీగా మలచుకోవాలని పర్యాటక దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఫలితంగా ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశముంది.  

లక్నో: భారత్‌ ఇక్కడ కాకపోతే... అహ్మదాబాద్‌ (ఆఖరి మ్యాచ్‌ వేదిక)లోనైనా సిరీస్‌ను గెలిచే ధీమాతో బరిలోకి దిగుతుండగా... దక్షిణాఫ్రికా ఇక్కడ ఓడితే ఇక్కడే సిరీస్‌ను ఆతిథ్య జట్టు చేతిలో పెట్టేసే భయంతో మ్యాచ్‌ ఆడనుంది. ఈ కారణంతోనే సిరీస్‌లో పైచేయి సాధించిన టీమిండియా రెట్టింపు హుషారుతో సమరానికి సై అంటోంది. 

గత మ్యాచ్‌లో స్పిన్, పేస్, బ్యాటింగ్‌ అన్నీ కలిసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసిన సూర్యకుమార్‌ బృందం గత ‘షో’ను పునరావృతం చేస్తే ఈ మ్యాచ్‌ గెలుపు, సిరీస్‌ కైవసం ఏమాత్రం కష్టం కానేకాదు. ఇక సఫారీ పరిస్థితి పూర్తి భిన్నం! మ్యాచ్‌లో గెలిచేందుకు లక్నోలో సిరీస్‌ను సమం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంది. కెప్టెన్ మార్క్‌రమ్‌ ఫామ్‌కు, డికాక్‌ మెరుపులు తోడైతే పరుగుల వరద పారే అవకాశముంది.  

ఆ ఇద్దరిపై ఒత్తిడి 
భారత జట్టు ఫలితాల పరంగా పైచేయిగా కనిపిస్తోంది. అలాగని జట్టులోని అందరి ప్రదర్శన బాగుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! నాయకుడు సూర్యకుమార్‌ మెరిపించి చాలా రోజులైంది. గత 21 ఇన్నింగ్స్‌లుగా అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనేది లేదు. ఫిఫ్టీ చేసి ఏడాది దాటింది. పోయిన ఏడాది అక్టోబర్లో అర్ధశతకం సాధించాక మళ్లీ అలాంటి మెరుపు ఇన్నింగ్స్‌ ఒక్కటీ ఆడలేదు. ఇక ఓపెనింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ వరుస వైఫల్యాలు బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెనుభారమే మోపుతోంది. 

గత మ్యాచ్‌లో 28 పరుగులు చేశాడు. కానీ 28 బంతులాడాడు. ఓ టాపార్డర్‌ బ్యాటర్‌కు... పైగా టి20ల్లో ఇది అత్తెసరు స్కోరే అవుతుంది. అభిషేక్‌ శర్మ, హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మలతో భారత్‌ బ్యాటింగ్‌లో గట్టెక్కుతుంది. బౌలింగ్‌ విభాగానికి వస్తే... భారత పేస్‌ ఎక్స్‌ప్రెస్‌ బుమ్రా ఈ మ్యాచ్‌కూ అందుబాటులో లేడు. తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో గత మ్యాచ్‌కు ముందే జట్టును వీడాడు. 

ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అనారోగ్యం కారణంగా ఆఖరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వీళ్లిద్దరు గత మ్యాచ్‌ కూడా ఆడనప్పటికీ... ఇది భారత బౌలింగ్‌ దళంపై ఒత్తిడిని పెంచే అంశం. ఏదో ఒక మ్యాచ్‌లో నెట్టుకురావొచ్చు. కానీ ప్రతీ మ్యాచ్‌లోనూ కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకపోతే ఏ జట్టుకైన అది ప్రతికూలాంశమే!  

హెండ్రిక్స్‌ ఘోర వైఫల్యం 
ప్రత్యర్థి దక్షిణాఫ్రికా సైతం టాపార్డర్‌ వైఫల్యంతో తడబడుతూనే ఉంది. ఓపెనర్లలో హెండ్రిక్స్‌ పేలవమైన ఆటతీరుతో టాపార్డర్‌కే కాదు మొత్తం జట్టుకే భారంగా పరిణమించాడు. ఒక మ్యాచ్‌లో 8, ఒకో మ్యాచ్‌లో డకౌట్‌. ఇక డికాక్‌ ఒక్క రెండో టి20 మినహా మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ 0, 1 సింగిల్‌ డిజిట్లే! ఇద్దరు ఓపెనర్లు ఘోరంగా ఆడుతుండటంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం కాదు కదా కనీసం ఓ మోస్తరు భాగస్వామ్యమైనా దక్కడం లేదు. ఇది మొత్తం ఇన్నింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

కెప్టెన్‌ మార్క్‌రమ్‌ సహా మిడిలార్డర్‌ బ్యాటర్లలో బ్రెవిస్, ఫెరిరా, మిల్లర్‌లతో జట్టు నెట్టుకొస్తుంది. కానీ నెగ్గాలంటే మాత్రం టాపార్డర్‌ కీలకం కదా! బౌలింగ్‌లో అనుభవజు్ఞలైన ఎన్‌గిడి, యాన్సెన్‌లతో పాటు ఒటెనిల్‌ బార్ట్‌మన్‌ నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నారు. అయితే సిరీస్‌ను సమం చేయాల్సిన ఈ మ్యాచ్‌లో మాత్రం ఏ ఒకరిద్దరు బౌలర్లో, బ్యాటర్లో కాదు సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన భారత్‌ను నిలువరిస్తుంది. లేదంటే గత ఫలితాలే పునరావృతం కాకతప్పదు.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్‌మన్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, హర్షిత్‌ రాణా, అర్‌‡్షదీప్, కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి. 
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్‌ లిండే/కేశవ్, ఎన్‌గిడి, బార్ట్‌మన్‌.

పిచ్, వాతావరణం
లక్నో స్పిన్‌ ఫ్రెండ్లీ వికెట్‌. తప్పకుండా బ్యాటింగ్‌ దిగిన జట్టుకు స్పిన్నర్ల నుంచి సవాళ్లు తప్పవు. అయితే మంచు ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్‌ అంటే ఛేదించే జట్టుకే అనుకూలిస్తుంది. టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కేమొగ్గుచూపుతుంది.. చలి తప్ప వాన ముప్పు లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement