కామెరాన్‌ గ్రీన్‌పై కోట్లాభిషేకం | Australian all rounder Cameron Green fetched a record price in the IPL mini auction | Sakshi
Sakshi News home page

కామెరాన్‌ గ్రీన్‌పై కోట్లాభిషేకం

Dec 17 2025 2:58 AM | Updated on Dec 17 2025 3:21 AM

Australian all rounder Cameron Green fetched a record price in the IPL mini auction

ఐపీఎల్‌ వేలంలో రూ. 25.20 కోట్లకు సొంతం చేసుకున్న కోల్‌కతా

లీగ్‌ చరిత్రలో అత్యధిక మొత్తం అందుకోనున్న విదేశీ ఆటగాడిగా రికార్డు

పతిరణ కోసం కూడా రూ.18 కోట్లు వెచ్చించిన కేకేఆర్‌

వేలంలో 77 మందిని ఎంచుకున్న ఫ్రాంచైజీలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మినీ వేలంలో ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ పంట పండింది. ఊహించినట్లుగా అతను అత్యధిక విలువ పలికాడు. అయితే అంచనాలకు మించి రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గ్రీన్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ నిలిచాడు. వేలానికి ముందు చేతిలో భారీ మొత్తం ఉన్న కేకేఆర్‌ అదే తరహాలో దానిని ఖర్చు కూడా చేసింది. 

లంక పేసర్‌ పతిరణ కోసం రూ. 18 కోట్లు చెల్లించడంతో పాటు ముస్తఫిజుర్‌ రహమాన్‌ను కూడా రూ. 9.20 కోట్లు ఇచ్చి తమ జట్టులోకి తీసుకుంది. భారత్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్లు ప్రశాంత్‌ వీర్, కార్తీక్‌ శర్మ కోసం చెన్నై రూ. 14.20 కోట్ల చొప్పున, కశ్మీర్‌ పేసర్‌ ఆఖిబ్‌ నబీ కోసం ఢిల్లీ రూ.8.40 కోట్లు వెచ్చించడం మంగళవారం వేలంలో హైలైట్‌గా నిలిచిన అంశం. ఓవరాల్‌గా 10 ఫ్రాంచైజీలు కలిపి వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. వీరిలో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  

అబుదాబి: ఐపీఎల్‌–2026 కోసం 10 జట్లలో ఉన్న ఖాళీలు పూరించేందుకు నిర్వహించిన మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు ఊహించని విధంగా అసాధారణ ధర దక్కగా... మరికొందరిని తక్కువ మొత్తానికి జట్లు ఎంచుకున్నాయి. ఇప్పటికే తమకంటూ గుర్తింపు ఉన్న పలువురు క్రికెటర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో ‘అన్‌సోల్డ్‌’గా మిగిలిపోయారు. 

మెగా వేలంతో పోలిస్తే సాధారణంగా ఆయా జట్ల వద్ద ఎక్కువ మొత్తం అందుబాటులో లేకపోవడంతో పాటు తక్కువ మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉండటంతో ‘సప్లయ్‌–డిమాండ్‌’ సూత్రం ప్రకారం సహజంగానే కొందరికి భారీ మొత్తాలు దక్కాయి. ఓవరాల్‌గా 359 మంది ఆటగాళ్లు వేలానికి రాగా, అన్ని జట్లూ కలిపి ఇందు కోసం మొత్తం రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి.  

గ్రీన్‌ వేలం సాగిందిలా... 
వేలంలో నాలుగో ఆటగాడిగా గ్రీన్‌ పేరు వచ్చింది. ముంబై ముందుగా మొదలు పెట్టగా, ఆ తర్వాత రాజస్తాన్, కోల్‌కతా జత కలిశాయి. రాజస్తాన్, కేకేఆర్‌ కలిసి దీనిని రూ.13.60 కోట్ల వరకు తీసుకెళ్లాయి. అయితే చెన్నై రూ.13.80 కోట్లు చెప్పడంతో మళ్లీ పోటీ మొదలైంది. రాజస్తాన్‌ రేసు నుంచి తప్పుకోగా... రెండు జట్ల మధ్య పోటీ సాగింది. చివరకు రూ.25.20 కోట్ల వద్ద కేకేఆర్‌ ఖాయం చేసుకుంది. 

పతిరణ కోసం ముందుగా ఢిల్లీ ఆసక్తి చూపించినా, లక్నో, కేకేఆర్‌ కలిసి పెద్ద మొత్తానికి తీసుకెళ్లాయి. ఆఖరికి పతిరణ కూడా నైట్‌రైడర్స్‌తోనే చేరాడు. ముందుగా పేరు వచ్చినప్పుడు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌ను ఎవరూ తీసుకోలేదు. అయితే మళ్లీ చివర్లో వచ్చినప్పుడు అతని కోసం మూడు జట్లు కేకేఆర్, లక్నో, సన్‌రైజర్స్‌ పోటీ పడగా రూ.13 కోట్లతో రైజర్స్‌ గెలుచుకుంది.  

అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్ల జోరు... 
భారీ సిక్సర్లతో ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆకట్టుకున్న రాజస్తాన్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కార్తీక్‌ శర్మ కోసం రూ. 30 లక్షలతో ముంబై బిడ్డింగ్‌ మొదలు పెట్టింది. అయితే ముంబై, లక్నో తప్పుకున్న తర్వాత కేకేఆర్, చెన్నై వేలాన్ని ముందుకు తీసుకెళ్లాయి. 

గత ఏడాది చెన్నై టీమ్‌తో కలిసి అతను ప్రాక్టీస్‌ చేశాడు. రూ.13 కోట్ల వద్ద ముగుస్తున్న దశలో సన్‌రైజర్స్‌ అడుగు పెట్టింది కానీ చివరకు కార్తీక్‌ చెన్నై చెంతకే చేరాడు. జడేజా తరహాలో లెఫ్టార్మ్‌ స్పిన్, దూకుడుగా బ్యాటింగ్‌ చేయగల ఉత్తరప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ కోసం కూడా పోటీ బాగా నడిచింది. మొత్తం ఆరు జట్లు అతడిని తీసుకునే ప్రయత్నంలో విలువను పెంచుతూ వెళ్లడం విశేషం. 

ఆఖరికి ప్రశాంత్‌ను సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంది. గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్‌లో సంచలన బౌలింగ్‌ ప్రదర్శన కనబరుస్తున్న కశ్మీర్‌ పేస్‌ బౌలర్‌ ఆఖిబ్‌ నబీ కోసం కూడా జట్లు పోటీ పడ్డాయి. మొదటి నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచిన ఢిల్లీ చివరి వరకు హైదరాబాద్‌తో పోటీ పడి నబీని సొంతం చేసుకుంది.  

గ్రీన్‌కు దక్కేది రూ. 18 కోట్లే!
వేలంలో రూ.25.20 కోట్లకు పలికినా కామెరాన్‌ గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్‌ ఫీజు (రూ.18 కోట్లు) లేదా మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్‌ పంత్‌)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం లభిస్తుంది. మిగిలిన రూ.7.20 కోట్లు బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి.

అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే 
చెన్నై: కార్తీక్‌ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌ (రూ.14.20 కోట్లు), రాహుల్‌ చహర్‌ (రూ.5.20 కోట్లు), మాట్‌ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్‌ హొసీన్‌ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్‌ (రూ.1.50 కోట్లు), జాక్‌ ఫూల్‌్క్స (రూ.75 లక్షలు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.75 లక్షలు), అమన్‌ ఖాన్‌ (రూ.40 లక్షలు). 
ఢిల్లీ: ఆఖిబ్‌ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్‌ (రూ.2 కోట్లు), ఎన్‌గిడి (రూ.2 కోట్లు), డకెట్‌ (రూ. 2 కోట్లు), మిల్లర్‌ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్‌ పరాఖ్‌ (రూ.30 లక్షలు). 
గుజరాత్‌: హోల్డర్‌ (రూ.7 కోట్లు), బాంటన్‌ (రూ. 2 కోట్లు), అశోక్‌ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్‌వుడ్‌ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్‌ (రూ. 30 లక్షలు). 
కోల్‌కతా: గ్రీన్‌ (రూ. 25.20 కోట్లు), పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్‌ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), ద„Š  కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు).  
లక్నో: ఇన్‌గ్లిస్‌ (రూ.8.60 కోట్లు), ముకుల్‌ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్‌ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్‌ తివారి (రూ.1 కోటి). 
ముంబై: డి కాక్‌ (రూ.1 కోటి), మయాంక్‌ రావత్‌ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్‌ (రూ. 30 లక్షలు), మొహమ్మద్‌ ఇజ్‌హార్‌ (రూ. 30 లక్షలు), డానిశ్‌ మాలేవర్‌ (రూ. 30 లక్షలు). 
పంజాబ్‌: డ్వార్‌షుయిస్‌ (రూ.4.40 కోట్లు), కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్‌ (రూ. 30 లక్షలు), ప్రవీణ్‌ దూబే (రూ. 30 లక్షలు). 
రాజస్తాన్‌: రవి బిష్ణోయ్‌ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్‌ (రూ.95 లక్షలు), సుశాంత్‌ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్‌ సేన్‌ (రూ.75 లక్షలు), బ్రిజేశ్‌ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్‌రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్‌ (రూ. 30 లక్షలు), యశ్‌రాజ్‌ (రూ. 30 లక్షలు). 
బెంగళూరు: వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 7 కోట్లు), మంగేశ్‌ యాదవ్‌ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్‌ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్‌ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్‌ (రూ. 30 లక్షలు). 
హైదరాబాద్‌: లివింగ్‌స్టోన్‌ (రూ.13 కోట్లు), జేక్‌ ఎడ్వర్డ్స్‌ (రూ.3 కోట్లు), సలీల్‌ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్‌ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్‌ (రూ. 30 లక్షలు), అమిత్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు), ఓంకార్‌ (రూ. 30 లక్షలు), సాకిబ్‌ హుస్సేన్‌ (రూ. 30 లక్షలు), శివాంగ్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు).

 వేలంలో అత్యధిక విలువ పలికిన టాప్‌ ఆటగాళ్లు
1. కామెరాన్‌ గ్రీన్‌ (కోల్‌కతా)     రూ. 25.20 కోట్లు 
2. పతిరణ (కోల్‌కతా)    రూ. 18 కోట్లు 
3. కార్తీక్‌ శర్మ (చెన్నై)    రూ.14.20 కోట్లు 
4. ప్రశాంత్‌ వీర్‌ (చెన్నై)    రూ. 14.20 కోట్లు 
5. లివింగ్‌స్టోన్‌ (హైదరాబాద్‌)    రూ. 13 కోట్లు 
6. ముస్తఫిజుర్‌ (కోల్‌కతా)    రూ. 9.40 కోట్లు 
7. జోష్‌ ఇన్‌గ్లిస్‌ (లక్నో)    రూ. 8.60 కోట్లు 
8. ఆఖిబ్‌ నబీ (ఢిల్లీ)    రూ. 8.40 కోట్లు 
9. రవి బిష్ణోయ్‌ (రాజస్తాన్‌)    రూ. 7.20 కోట్లు 
10. జేసన్‌ హోల్డర్‌ (గుజరాత్‌)    రూ. 7 కోట్లు 
11. వెంకటేశ్‌ అయ్యర్‌ (బెంగళూరు)    రూ. 7 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement