అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2026 మినీ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మకు జాక్ పాట్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ వీర్ రికార్డును కార్తీక్ సమం చేశాడు.
రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కార్తీక్ శర్మ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిడ్డింగ్ వార్ నెలకొంది. కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ పోటీ నుంచి తప్పుకోవడంతో అతడు సీఎస్‌కే సొంతమయ్యాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపుతున్నారు.
ఎవరీ కార్తీక్ శర్మ?
రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ.
స్ట్రీట్ క్రికెట్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కార్తీక్.. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. కార్తీక్ శర్మ ఆఖరిలో వచ్చి తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (SMAT) ఐదు మ్యాచ్‌ల్లో 160.24 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు.
సీఎస్‌కే అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వేలానికి ముందే అతడిని సీఎస్‌కే ట్రయల్స్‌కు పిలిచింది. కార్తీక్ ఇప్పటివరకు రాజస్తాన్ తరపున 12 టీ20లు ఆడి 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. అంతేకాకుండా 8 మ్యాచ్‌లు ఆడి 479 పరుగులు సాధించాడు.
రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే ఉత్తరాఖండ్‌పై సెంచరీతో సత్తాచాటాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 445 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకునే అతడిపై భారీ మొత్తాన్ని సీఎస్‌కే వెచ్చించింది. అదేవిధంగా మరో యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను సైతం రూ.14.20 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసమే సీస్‌కే రూ.28 కోట్లపైన ఖర్చు చేసింది.
చదవండి: IPL 2026: రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు


