హరియాణా చేతిలో 124 పరుగుల తేడాతో పరాజయం
తుది పోరుకు చేరని వైనం
పుణే: ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరే చక్కటి అవకాశాన్ని కోల్పోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన హైదరాబాద్... మంగళవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన చివరి పోరులో 124 పరుగుల తేడాతో హరియాణా చేతిలో ఓడింది. దీంతో రన్‌రేట్‌లో వెనుకబడి ‘సూపర్ లీగ్’ దశతోనే సరిపెట్టుకుంది. రెగ్యులర్ కెప్టెన్ సీవీ మిలింద్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంకాగా... తనయ్ త్యాగరాజన్ ఈ మ్యాచ్‌లో నాయకత్వం వహించాడు. టాస్ గెలిచిన తనయ్ ఫీల్డింగ్ ఎంచుకోవాలని నిర్ణయం తీసుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన హరియాణా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమంత్ జాఖర్ (22 బంతుల్లో 60; 1 ఫోర్, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... కెపె్టన్ అంకిత్ కుమార్ (27 బంతుల్లో 57; 1 ఫోర్, 6 సిక్స్‌లు), పార్థ్ వత్స్ (19 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టారు. హైదరాబాద్ బౌలర్లలో స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 37 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా... మిగిలిన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 16.1 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది.
రాహుల్ బుద్ధి (37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. తన్మయ్ అగర్వాల్ (3), అమన్ రావు (13), మికిల్ జైస్వాల్ (7), కెపె్టన్ తనయ్ త్యాగరాజన్ (16), అర్ఫాజ్ అహ్మద్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. హరియాణా బౌలర్లలో అమిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. ‘సూపర్ లీగ్’ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 2 విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించి గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ రన్‌రేట్ (–0.413) కంటే మెరుగ్గా ఉన్న హరియాణా (+2.325) ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్ 2 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై, ముంబై 3 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలిచాయి. రెండు గ్రూప్‌ల్లో ‘టాప్’లో నిలిచిన హరియాణా, జార్ఖండ్ మధ్య గురువారం ఫైనల్ జరగనుంది. ముస్తాక్ అలీ టోర్నీలో ఈ రెండు జట్లు తొలిసారి తుది పోరుకు చేరుకోవడంతో కొత్త చాంపియన్‌గా అవతరించడం ఖాయమైంది.


