ఫైనల్ చాన్స్ మిస్
ముస్తాక్ అలీ టి20 టోర్నీ
పుణే: దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ‘సూపర్ లీగ్’ దశతోనే ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా... మంగళవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం సాధించినా... రన్‌రేట్‌లో వెనుకబడ్డ కారణంగా ఫైనల్ చేరే అవకాశం కోల్పోయింది. ‘సూపర్ లీగ్’లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు 2 విజయాలు, ఒక పరాజయంతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
జార్ఖండ్ కూడా ఎనిమిది పాయింట్లతోనే ఉన్నా... రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న జార్ఖండ్ ముందంజ వేయగా... ఆంధ్ర జట్టు ఇంటిబాట పట్టింది. టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/32) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 9 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ రెడ్డి టాప్ స్కోరర్ కాగా... శ్రీకర్ భరత్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), అశి్వన్ హెబ్బర్ (30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం జార్ఖండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. విరాట్ సింగ్ (40 బంతుల్లో 77; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.
ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన జార్ఖండ్ (+0.221)... ఆంధ్ర (–0.113) చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో మాత్రమే ఓడటంతో మెరుగైన రన్‌రేట్‌తో తుదిపోరుకు అర్హత సాధించింది.


