కేరళపై ఆంధ్ర విజయం
లక్నో: ఓపెనర్ శ్రీకర్ భరత్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో... దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 7 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (56 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన సామ్సన్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. రోహన్ కున్నుమ్మల్ (2), మొహమ్మద్ అజహరుద్దీన్ (6), క్రిష్ణ ప్రసాద్ (5), అబ్దుల్ బాసిత్ (2), సల్మాన్ నిజార్ (5), షర్ఫుద్దీన్ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భరత్ దంచేయగా... అశ్విన్ హెబ్బర్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), పైల అవినాష్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు ఐదు విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో సోమవారం విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది.
అభిషేక్ అదరహో..
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు; 2/8)... సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతు న్నాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 73 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
పంజాబ్ కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ దంచికొట్టగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (22 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకున్నారు. సర్వీసెస్ బౌలర్లలో అభిషేక్ తివారి, విశాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో సర్వీసెస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది.
అభిషేక్ తివార టరి(30 బంతుల్లో 40; 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లువిఫలమయ్యారు. బౌలింగ్‌లో అభిషేక్, సాన్‌వీర్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పాండిచ్చేరి 81 పరుగుల తేడాతో బెంగాల్‌పై, గుజరాత్ 1 వికెట్ తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై హర్యానా 8 పరుగుల తేడాతో బరోడాపై విజయాలు సాధించాయి.
హైదరాబాద్ ‘టాప్’ షో
బిహార్‌పై ఘనవిజయం
కోల్‌కతా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా... శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో బిహార్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పియూశ్ సింగ్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), బిపిన్ సౌరభ్ (19 బంతుల్లో 31 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు.
హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3, చామా మిలింద్ రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో హైదరాబాద్ 12.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (42 బంతుల్లో 67; 11 ఫోర్లు, 1 సిక్స్), ప్రజ్ఞయ్ రెడ్డి (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తాచాటారు. గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు, ఒక పరాజయంతో 20 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో ఉంది.


