న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) జరగనుంది. పోటీలన్నీ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ శనివారం పేర్కొన్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా... ఒక్కో జట్టులో 9 మంది రెజ్లర్లు ఉంటారు. వీరిలో నలుగురు మహిళలు తప్పనిసరి.
అన్నీ జట్లలో ఐదుగురు భారత రెజ్లర్లతో పాటు నలుగురు విదేశీ రెజ్లర్లకు అవకాశం కల్పించారు. వేలంలో 20 దేశాలకు చెందిన 300 మంది రెజ్లర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు. ఇందులో ఒలింపిక్ పతక విజేతలు, ప్రపంచ చాంపియన్‌షిప్ విజేతలు, పలువురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నట్లు సంజయ్ సింగ్ తెలిపారు.


