
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలపై డబ్ల్యూఎఫ్‌ఐ కన్నెర్ర
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కన్నెర్ర చేసింది. 11 మంది రెజ్లర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. కొందరు రెజ్లర్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) జారీ చేసినట్లుగా నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో వయో విభాగాల టోర్నీలో పాల్గొనేందుకు చూస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టగా కొందరు కావాలని పుట్టిన ఏడాదిలోపు కాకుండా చాలా ఆలస్యంగా ఎంసీడీలో జనన నమోదు చేస్తున్నారు. తద్వారా తక్కువ వయస్సు విభాగంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు.
విచారణలో జనన నమోదు చేసుకున్న వారిలో కొందరు ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నారని తేలడంతో డబ్ల్యూఎఫ్‌ఐ 11 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. సక్ష్యం, మనుజ్, కవిత, అన్షు, అరుశ్ రాణా, శుభమ్, గౌతమ్, జగ్‌రూప్ ధన్‌కర్, నకుల్, దుష్యంత్, సిద్ధార్థ్ బలియాన్‌లపై నిషేధం విధించారు. ప్రత్యేకించి రెజ్లింగ్‌లో రెండు రకాల నకిలీ పత్రాలు సమాఖ్యకు తలనొప్పిగా మారాయి.
ఇందులో మొదటిది తప్పుడు వయో ధ్రువీకరణ కాగా... రెండోది ఒక ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్రాలతో స్థానికత నిబంధనకు విరుద్ధంగా పోటీపడటం. హరియాణాలో రెజ్లింగ్‌కు విపరీతమైన పోటీ ఉంటుంది. కుప్పలుతెప్పలుగా ఉన్న అఖాడాల నుంచి వందల సంఖ్యలో రెజ్లర్లు తయారవుతారు.
కానీ వీరంతా జాతీయ పోటీల్లో పాల్గొనాలంటే రాష్ట్రం తరఫున గట్టి పోటీ ఉంటుంది. చాలామందికి అవకాశాలు రావు. దీంతో హరియాణా రెజ్లర్లు పక్క రాష్ట్రాలకు చెందిన రెజ్లర్లుగా నకిలీ పత్రాలు సృష్టించి పోటీల్లో పాల్గొంటారు. ప్రతి క్రీడలోనూ వయో విభాగాలు, జూనియర్ టోర్నీల్లో నకిలీ సరి్టఫికెట్ల బెడద వేధిస్తోంది. దీనివల్ల అర్హులైన పిన్న వయసు్కలు నష్టపోతున్నారు.
క్రీడా శాఖకు రెజ్లర్ తండ్రి ఫిర్యాదు
హరియాణాకు చెందిన ఇషిక రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఢిల్లీ తరఫున పోటీపడింది. దీనిపై ఢిల్లీ రెజ్లర్ రితిక తండ్రి నీరజ్ కుమార్ కేంద్ర క్రీడాశాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. స్థానికత నిబంధనలకు విరుధ్దంగా ఇషికను 53 కేజీల కేటగిరీలో ఢిల్లీ తరఫున పోటీపడేందుకు అనుమతించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇషిక నివాస ధ్రువీకరణ పత్రాలను ఆ ఫిర్యాదుకు జతచేసినట్లు ఆయన చెప్పారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు.