అందని జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు
‘మీ సేవ’ ద్వారా సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన సీడీఎంఏ
ఎన్‌ఐసీ, యూబీడీఎంఐఎస్ మధ్య సమన్వయ లోపంతో సమస్య
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వివిధ పనుల కోసం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకున్న వేలాదిమందికి ఆ పత్రాల జారీ స్తంభించింది. దరఖాస్తులను అధికారులు ధ్రువీకరిస్తే, మీ సేవ కేంద్రాలకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉండగా.. ‘ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణకు సంబంధించిన సేవ అందుబాటులో లేదు..’(బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ సీడీఎంఏ (కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్) సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ప్రజెంట్) అనే సమాధానం వస్తోంది. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుకు సిద్ధమైన వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్ అప్‌డేట్, పేర్ల మార్పు, రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్, లీగల్ ఎయిడ్, వీసాలు తదితర అవసరాలకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. కొన్ని బ్యాంక్ లావాదేవీలకు కూడా చూపించాల్సి ఉంటుంది.

సమన్వయ లోపం
ఎన్‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్).. యూబీడీఎంఐఎస్ (యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ రిజి్రస్టేషన్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) మధ్య సమన్వయ లోపంతో సరి్టఫికెట్ల జారీకి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సీడీఎంఏ సర్వర్ డౌన్ కావడం వల్ల స్టేట్ డేటా సెంటర్‌కు కనెక్ట్ కావడంలో సాంకేతిక ఇబ్బందులతో ఈ పత్రాల జారీ ఆగిపోయింది. యూబీడీఎంఐఎస్ పోర్టల్ ద్వారా ధ్రువీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేయడంతో పాటు దరఖాస్తుల స్థితిగతులు తెలుసుకోవచ్చు. కేంద్రం పర్యవేక్షణ లోని ఎన్‌ఐసీ ఈ–గవర్నెన్స్ అప్లికేషన్ల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది.
కుల ధ్రువీకరణలోనూ ఇబ్బందులు
ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాక మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలించి అనుమతివ్వాల్సి ఉంది. కాగా మీ సేవ మేనేజర్లకు అడిగితే రెండు, మూడు రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. దీనితోపాటు ఎస్సీ కుల ధ్రువీకరణ మినహా ఇతర కుల ధృవీకరణ పత్రాల జారీలోనూ ఇబ్బందులు ఎదురువుతున్నట్లు తెలిసింది. సర్వర్ డౌన్ కావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలిపారు.


