రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను గుర్తు చేస్తూ కార్యక్రమాలు
తెలంగాణ భవన్‌లో ప్రధాన కార్యక్రమానికి కేటీఆర్ హాజరు
జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఘట్టాన్ని గుర్తు చేస్తూ ‘దీక్షా దివస్’కోసం ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.
కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. కాగా, దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉద్యమ ఘట్టాలను గుర్తు చేస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్, కేసీఆర్ పాత్రను గుర్తు చేసేలా రూపొందించిన డాక్యుమెంటరీని కేటీఆర్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లా కేంద్రాల్లోనూ కార్యక్రమాలు
దీక్షా దివస్ ఏర్పాట్లకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమా వేశాలు నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లా కేంద్రాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర సాధనలో కేసీఆర్ కృషిని కొత్త తరానికి చాటి చెప్పేందుకు యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లోనూ ‘దీక్షా దివస్’ను నిర్వహించనున్నారు.
కేసీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫొటోలను తెలంగాణ భవన్ నుంచి పంపించారు. కార్యక్రమం ప్రారంభంలో కార్యకర్తలు పార్టీ అధినేత కేసీఆర్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తారు. తెలంగాణ భవన్‌లో జరిగే ‘దీక్షా దివస్’ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు.


