పిటిషనర్లకు తేల్చిచెప్పిన సీజే ధర్మాసనం
50 శాతం రిజర్వేషన్ల జీవోపై స్టేకు నిరాకరణ
కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను అడ్డుకోలేమని హైకోర్టు సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ ఇచ్చిన జీవో 46 నిలిపివేతకు నిరాకరించింది. రాజ్యాంగ నిబంధన ద్వారా జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం కూడదని, ఎన్నికల నిలిపివేత సరికాదని సుప్రీంకోర్టు పదేపదే చెప్పిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285(ఏ) ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని చెప్పింది.
ఈ నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మాచదేవ రజకుల సంఘంతోపాటు మరో ముగ్గురు ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో 46ను జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 9(4) ప్రకారం.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఏ, బీ, సీ, డీలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు.
డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయ్యిందన్నారు. నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతోందని, ఈ సమయంలో జోక్యం సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
ఆ నివేదిక బహిర్గతం చేస్తే నష్టమేంటి?
బీసీలపై అధ్యయనం చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక బహిర్గతం చేస్తే వచ్చే నష్టమేంటని సర్కార్‌ను న్యాయమూర్తి జసిŠట్‌స్ టి.మాధవీదేవి ప్రశ్నించారు. కవరింగ్ లేటర్, కమిషన్ చైర్మన్ సంతకం లేకుండా నివేదిక కోర్టుకు సమరి్పంచడాన్ని తప్పుబట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై న్యాయమూర్తి శుక్రవారం విచారణ చేపట్టారు. రిజర్వేషన్ల ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేనందున ఎన్నికలను నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు.
ప్రస్తుతం స్టే ఇవ్వకుంటే.. తర్వాత పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు వచి్చనా అప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జోక్యం చేసుకోవద్దని ఏజీ కోరారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించిన తీరు సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సీజే ధర్మాసనం ముందు కూడా పిటిషన్లు ఉన్నందున ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ 4 వారాలకు వాయిదా వేశారు.


