జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యయనం
అంతర్గత నివేదికల్లోని అంశాల ఆధారంగా భవిష్యత్ ఎన్నికలకు సిద్ధమయ్యే యోచన
గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు..
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ బలంగానే ఉందంటున్న నివేదికలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుభవాలను అధికార కాంగ్రెస్ పార్టీ మదింపు చేస్తోంది. ఈ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు అంతర్గత నివేదికలను సిద్ధం చేస్తోంది. దీంతో పాటు ఎన్నికల ఫలితం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, ఇతర అంతర్గత చర్చల్లో వెల్లడైన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఈ ఎన్నిక సందర్భంగా గుర్తించిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని జీహెచ్‌ఎంసీలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించనుంది. కాంగ్రెస్ పార్టీ ‘జూబ్లీ’యేషన్ మోడల్‌ను గ్రేటర్ హైదరాబాద్ అంతటా అమలు చేయనుంది. ఉప ఎన్నికపై అంతర్గత నివేదికలు, చర్చల్లో వెల్లడైన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
సమష్టి కృషితోనే గెలుపు
⇒ రాజకీయంగా పట్టు లేని నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం అసాధారణమైన అంశం. ఈ ఎన్నికల్లో గెలుపునకు పార్టీ నేతల సమష్టి కృషే ప్రధాన కారణం. పార్టీ అధికారంలో ఉండడం కూడా దోహదపడింది.
⇒ ఇక్కడ బీఆర్‌ఎస్ శక్తివంచన లేకుండా పనిచేసింది. ఆ పార్టీ కేడర్ దెబ్బతినలేదు. జూబ్లీహిల్స్‌లోనే కాకుండా హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో కారు పార్టీ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది.
⇒ ఆ పార్టీ ఎలక్షనీరింగ్ కూడా పకడ్బందీగా జరిగింది. ముఖ్యంగా కుల సంఘాలను సమావేశపర్చడం, అపార్ట్‌మెంట్లు, బస్తీల వారీగా పోలరైజ్ చేయడంలో క్రియాశీలంగా పనిచేసింది.
బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు
⇒ బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని ఫలితాలు చెపుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడ ఎంత లూజ్‌గా ఉన్నా ఆ పార్టీకి 15 శాతం ఓట్లు వస్తాయి. ఈ రెండు పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలి.
⇒ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. హైదరాబాద్‌లో చాలాచోట్ల పార్టీకి కమిటీల్లేవు. కాబట్టి బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. క్రియాశీలంగా లేని వారిని గుర్తించి వారిని పార్టీ పనిలోకి తీసుకురావాలి.
⇒జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు. ఉప ఎన్నికల సమయంలో హైప్ అయినంతగా ముస్లిం వర్గం ఆ పార్టీతో లేదు. ముస్లిం నేతల్లో చాలామంది ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు.
మహిళలను ఆకట్టుకోవాలి
⇒ మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిస్థాయి విశ్వాసం కనబర్చలేదు. వారిని ఆకట్టుకునే కార్యక్ర మాలు అమలుపర్చాలి. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్రమంతటా మహిళల మనసు చూరగొనేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
⇒ హైడ్రాపై ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో వ్యతి రేకత లేదు. హైడ్రాతో ప్రత్యక్షంగా నష్టపోయిన పేద, మధ్యతరగతి వర్గాలు చాలా తక్కువ. ఎక్కువగా బడాబాబులపై మాత్రమే హైడ్రా ప్రభావం ఉంది. 10–20 శాతానికి మించి హైడ్రాపై వ్యతిరేకత లేదు.
⇒ జూబ్లీహిల్స్‌లో పార్టీ విజయానికి మరో ప్రధాన కారణం ఎంపిక చేసిన అభ్యర్థి. స్థానికుడైన బీసీని నిలబెట్టడం చాలా ఉపకరించింది. ఇదే వ్యూహాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాలి.
⇒ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కొంతమేరకు కనిపించినా, సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు మొదలైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే భావనకు ప్రజలు క్రమంగా వచ్చారు.
⇒ మొత్తంమీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణంగా సిటీ ఓటరు నాడిని పట్టుకోగలిగాం. వీరికి పార్టీల కన్నా వారి సమస్యలు, వారి పరిసరాల్లో ఉండే వాతా వరణం, ప్రభుత్వ పనితీరు లాంటివి ముఖ్యమన్నది అర్థమైంది.


