అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 13- 15 వరకు అతడు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.
‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా.. ఇప్పుడు హైదరాబాద్ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు.
ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది’’ అంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. కాగా మెస్సీ తన టూర్‌లో భాగంగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి.


