నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా | IND Vs SA 1st ODI, India Beat South Africa In Last Over Thriller, Check Out Score Details And Match Highlights Inside | Sakshi
Sakshi News home page

IND Vs SA 1st ODI: నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

Nov 30 2025 9:50 PM | Updated on Dec 1 2025 11:53 AM

IND vs SA 1st ODI: India Beat South Africa In Last Over Thriller

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్‌కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. 

రాంచిలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం కాంప్లెక్స్‌లో టాస్‌ వేదికగా తొలి వన్డేలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. 

రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ ధనాధన్‌
ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్‌ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్‌ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. 

ఆదిలోనే షాకులు
సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, నండ్రీ బర్గర్‌, కార్బిన్‌ బాష్‌, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ను డకౌట్‌ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన క్వింటన్‌ డికాక్‌ను కూడా డకౌట్‌గా వెనక్కి పంపాడు. 

అదరగొట్టిన  మాథ్యూ, యాన్సెన్‌
మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (7)ను అర్ష్‌దీప్ సింగ్‌ అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్‌ జట్టును మాథ్యూ బ్రీట్జ్‌కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్‌ యాన్సెన్‌ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్‌ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37) ఫర్వాలేదనిపించారు. 

భయపెట్టిన బాష్‌
అయితే, సగం ఇన్నింగ్స్‌లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్‌ సుబ్రేయన్‌ (17), నండ్రీ బర్గర్‌ (17) ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్‌ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. 

తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్‌ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. 

ప్రసిద్‌ కృష్ణ, రోహిత్‌ అద్భుతం
ఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్‌ గాల్లోకి లేపగా ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న రోహిత్‌ శర్మ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది.

భారత బౌలర్లలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్‌ రాణా మూడు, అర్ష్‌దీప్‌ రెండు, ప్రసిద్‌ కృష్ణ ఒక కీలక వికెట్‌ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement