సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి శతక్కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ శతకం. ఈ నేపథ్యంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు కోహ్లి.
వింటేజ్ కింగ్
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఆసీస్‌తో మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్‌ను కొనసాగించాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ 102 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో 38వ ఓవర్లో ఐదో బంతికి మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
రోహిత్‌తో కలిసి ధనాధన్
రాంచి వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి ఇన్నింగ్ నిర్మించాడు.
రోహిత్ శర్మ అర్ద శతకం (57)తో సత్తా చాటగా.. అతడితో కోహ్లి రెండో వికెట్‌కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించాడు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లి మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కేఎల్ రాహుల్ కోహ్లికి తోడుగా నిలిచాడు.
ఈ క్రమంలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చిన కోహ్లి జోరు పెంచాడు. ఫలితంగా 41 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
చదవండి: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్


