టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచింది. రాంచి వేదికగా తాము తొలుత ఫీల్డింగ్ చేయనున్నట్లు ప్రొటిస్ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. వికెట్ పాతబడుతున్న కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని.. రాత్రివేళ మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తాము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
ఇక రాంచి వన్డేలో తాము ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నట్లు మార్క్రమ్ తెలిపాడు. సుబ్రేయన్‌తో పాటు తాను కూడా పార్ట్‌టైమ్ బౌలింగ్ చేస్తానని పేర్కొన్నాడు. కెప్టెన్ తెంబా బవుమాతో పాటు కేశవ్ మహరాజ్‌కు విశ్రాంతినిచ్చామన్న మార్క్రమ్.. నలుగురు సీమర్లను ఆడించనున్నట్లు వెల్లడించాడు.

ముగ్గురు స్పిన్నర్లతో భారత్
మరోవైపు.. శుబ్‌మన్ గిల్ గైర్హాజరీలో టీమిండియాకు సారథ్యం వహిస్తున్న కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో నిలబడటం కీలకమని... తాము మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు.
పటిష్ట జట్టుతో పోటీపడటం తమకు సవాలు లాంటిదని.. అనుకూల ఫలితం రాబట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు. తమ తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇచ్చినట్లు కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తెలిపాడు.

టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే తుదిజట్లు ఇవే
టీమిండియా
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.
సౌతాఫ్రికా
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనేలన్ సుబ్రేయన్, నండ్రీ బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్.


