ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌! | Rohit Sharma Stunning Reaction To Virat Kohli 52nd Century Against South Africa Video Went Viral, Fans Slams Gambhir And Agarkar | Sakshi
Sakshi News home page

ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌!

Nov 30 2025 6:56 PM | Updated on Dec 1 2025 11:38 AM

Rohit Reaction Goes Viral After Kohli 52nd Ton Fans Slams Gambhir Agarkar

‘వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చెప్పిన మాట ఇది.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా ప్రకటించిన అగార్కర్‌.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్‌ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్‌ టూర్‌లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్‌ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు.

రో- కో వన్డే భవితవ్యంపై చర్చ
మూడో వన్డేలో శతక్కొట్టి భారత్‌ను గెలిపించడంతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.

టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్‌ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్‌, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్‌ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.

ఇచ్చిపడేశారు భయ్యా!
ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్‌, అగార్కర్‌లను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్‌ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

రోహిత్‌ శర్మ రియాక్షన్‌ వైరల్‌
అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్‌- అగార్కర్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్‌ సమయంలో రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ మరింత హైలైట్‌ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.

ముఖం మీద కొట్టినట్లుగా 
ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్‌ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్‌ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కాగా.. గంభీర్‌- అగార్కర్‌లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్‌ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.

చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. 7000వ సెంచరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement