
భారత స్టార్ రెజ్లర్‌పై జాతీయ సమాఖ్య క్రమశిక్షణ చర్య
అధిక బరువుతో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అనర్హతకు గురైన అమన్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌పై ఏడాది నిషేధం పడింది. నిర్ణీత బరువు కంటే అధికంగా ఉన్న కారణంగా ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌నకు దూరమైన అమన్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చర్యలు తీసుకుంది. గత నెలలో క్రొయేషియా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ 57 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన అమన్... 1700 గ్రాములు అధిక బరువు కారణంగా పోటీలకు దూరమయ్యాడు. దీంతో పతకం సాధిస్తాడనే ఆశలు ఉన్న అమన్ పోటీకి అనర్హుడిగా తేలడంతో డబ్ల్యూఎఫ్‌ఐ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది.
అమన్ వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ... ఏడాది కాలం పాటు అతడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం గత నెల సెప్టెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ వెల్లడించింది. అతడి శిక్షణ సిబ్బందిని హెచ్చరించి వదిలేసింది. పోటీలకు రెండు వారాల ముందే క్రొయేషియాకు వెళ్లిన అమన్... పోటీలు ప్రారంభమయ్యే సమయానికి నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం తప్పుడు సంకేతమని డబ్ల్యూఎఫ్‌ఐ పేర్కొంది.
‘ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ నుంచి అత్యుత్తమ క్రమశిక్షణ ఆశిస్తాం. అలాంటిది నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం సరైంది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో తాత్సారానికి తావు లేదు. ఇది దేశ ప్రజల ఆశలను వమ్ము చేయడమే’ అని డబ్ల్యూఎఫ్‌ఐ వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా వినేశ్ ఫొగాట్, ఈ ఏడాది ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ సందర్భంగా నేహా సాంగ్వాన్ కూడా ఇలాగే అధిక బరువుతో పోటీలకు దూరమయ్యారు.