breaking news
Aman Sehrawat
-
అమన్‌పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌పై ఏడాది నిషేధం పడింది. నిర్ణీత బరువు కంటే అధికంగా ఉన్న కారణంగా ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌నకు దూరమైన అమన్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చర్యలు తీసుకుంది. గత నెలలో క్రొయేషియా వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ 57 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన అమన్... 1700 గ్రాములు అధిక బరువు కారణంగా పోటీలకు దూరమయ్యాడు. దీంతో పతకం సాధిస్తాడనే ఆశలు ఉన్న అమన్ పోటీకి అనర్హుడిగా తేలడంతో డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. అమన్ వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ... ఏడాది కాలం పాటు అతడు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం గత నెల సెప్టెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్లు డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. అతడి శిక్షణ సిబ్బందిని హెచ్చరించి వదిలేసింది. పోటీలకు రెండు వారాల ముందే క్రొయేషియాకు వెళ్లిన అమన్... పోటీలు ప్రారంభమయ్యే సమయానికి నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం తప్పుడు సంకేతమని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. ‘ఒలింపిక్ పతకం సాధించిన రెజ్లర్ నుంచి అత్యుత్తమ క్రమశిక్షణ ఆశిస్తాం. అలాంటిది నిర్ణీత బరువును కొనసాగించలేకపోవడం సరైంది కాదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంలో తాత్సారానికి తావు లేదు. ఇది దేశ ప్రజల ఆశలను వమ్ము చేయడమే’ అని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా వినేశ్ ఫొగాట్, ఈ ఏడాది ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్ సందర్భంగా నేహా సాంగ్వాన్ కూడా ఇలాగే అధిక బరువుతో పోటీలకు దూరమయ్యారు. -
అమన్‌కు షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ వేదికగా జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి అమన్ సెహ్రావత్ అధిక బరువు కారణంగా డిస్క్వాలిఫై అయ్యాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడాల్సిన అమన్... నిర్ణీత బరువుకంటే 1700 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు అతడిని పోటీ నుంచి తొలగించారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధిస్తాడని భావించిన అమన్ ఇలా అర్ధాంతరంగా వైదొలగడంపై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహంగా ఉంది. ఈ పోటీలకు భారత్ నుంచి నలుగురు కోచ్‌లు వెళ్లగా... వారెవరూ అమన్ నిర్ణీత బరువు కొనసాగించడంలో తోడ్పాటు అందించకపోవడంతో సమాఖ్య వారికి కూడా నోటీసులిచ్చింది. ‘ఇది ఆమోదనీయం కాదు. దీని వెనక ఉన్న కారణాలను వెలికితీయాలి. రెండు నెలల వ్యవధిలో మన అత్యుత్తమ రెజ్లర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. అందుకే అమన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశాం’ అని డబ్యూఎఫ్ఐ అధికారి తెలిపారు. చీఫ్ కోచ్ జగ్మందర్ సింగ్, వినోద్, వీరేందర్, నరేందర్‌లను కూడా దీనిపై వివరణ ఇవ్వాలని సమాఖ్య కోరింది. ‘జాగ్రెబ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి మొత్తం 10 మంది రెజ్లర్లు, నలుగురు కోచ్‌లు వెళ్లారు. టోర్నీకి 15 రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. రెజ్లర్లందరూ తమ బరువును క్రమపద్ధతిలో ఉండే విధంగా చూసుకోవడం కోచ్‌ల కర్తవ్యం. అందుకే వారు కూడా దీనికి బాధ్యులే’ అని ఆ అధికారి వెల్లడించారు. సెలక్షన్ ట్రయల్స్ సమయం నుంచే బరువు విషయంలో పకడ్బందీగా ఉండాలని సమాఖ్య భావిస్తోంది. రెండు కేజీల వెసులుబాటు అంశాన్ని పక్కనపెట్టి నిర్దిష్టమైన బరువు కొనసాగించే విధంగా రెజ్లర్లకు ముందు నుంచే శిక్షణ ఇవ్వాలని అనుకుంటోంది. ‘మేము ఇప్పటికే కొంతమంది కోచ్‌లతో ఈ విషయాన్ని చర్చించాం. ఇలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని చెప్పాం. అది అలవాటుగా మారిపోయి... ప్రధాన పోటీలకు మందు తక్కువ సమయంలో బరువు తగ్గించుకోవాల్సి రావడంతో రెజ్లర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. త్వరలో జరగనున్న అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో నిర్దిష్ట బరువును మాత్రమే అనుమతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 20 నుంచి సెర్బియా వేదికగా అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుండగా... దానికి ముందు లక్నో వేదికగా అక్టోబర్ 4, 5న ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇటీవల అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి ఓవర్ వెయిట్ కారణంగా అనర్హతకు గురైన యువ రెజ్లర్ నేహా సాంగ్వాన్‌పై డబ్ల్యూఎఫ్ఐ సస్పెన్షన్ వేటు వేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇలాగే 100 గ్రాముల అధిక బరువుతో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. -
భారత స్టార్‌కు ఊహించని షాక్
జాగ్రెబ్ (క్రొయేషియా): స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమైన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఈ రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు. తన వెయిట్ కేటగిరీలో అధిక బరువు వల్లే అతను ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. సాధారణంగా.. పోటీలకు ముందు రెజ్లర్‌కు బరువును (వెయింగ్) చూస్తారు.1.7 కేజీలు అధిక బరువుపురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడేందుకు సిద్ధమైన అమన్ ఉండాల్సిన బరువుకంటే ఏకంగా 1.7 కేజీలు (1700 గ్రాములు) అధిక బరువు ఉండటంతో నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. అమన్లాంటి రెజ్లర్ తన బరువును అదుపులో ఉంచుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. బరువును తూచే వెయింగ్ మిషిన్‌పై అతను నిలబడితే 1.7 కేజీలు అధికంగా ఉన్నట్లు కనిపించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అతను అంత బరువు ఎలా పెరిగాడో అర్థమవడం లేదు’ అని జాగ్రెబ్‌లో ఉన్న భారత జట్టు అధికారి ఒకరు వెల్లడించారు.100 గ్రాములు ఎక్కువ ఉన్నాకాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ప్రపంచకప్, ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో ఉండాల్సిన బరువు కంటే రెండు కేజీల అదనపు బరువును కూడా అనుమతిస్తారు. అయితే ప్రపంచ చాంపియన్ షిప్, ఒలింపిక్స్‌లాంటి మెగా టోర్నీల్లో మాత్రం 100 గ్రాములున్నా వెంటనే అనర్హత వేటు వేస్తారు. నెల వ్యవధిలోనేగత నెల 25నే అమన్ జాగ్రెబ్‌కు చేరుకున్నాడు. పలువురు భారత రెజ్లర్లతో కలిసి ఈవెంట్ కోసం ముమ్మరసాధనలో నిమగ్నమయ్యాడు. కానీ ఇంత చేసీ కీలకమైన బరువును అదుపులో ఉంచుకోవడంలో విఫలమయ్యాడు. నెల వ్యవధిలోనే భారత బృందానికి ఇది రెండో డిస్క్వాలిఫై! మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్ (59 కేజీల కేటగిరీ) గత నెల బల్గేరియాలో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 600 గ్రాములు అధిక బరువు వల్ల అనర్హతకు గురైంది.నిజానికి ఆమె తాజాగా క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరుగుతున్న ఈవెంట్లో కూడా పాల్గొనేందుకు సీనియర్ జట్టుకు ఎంపికైంది. అయితే బరువు నియంత్రణలో పదేపదే నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను భారత రెజ్లింగ్ సమాఖ (డబ్ల్యూఎఫ్ఐ) ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాటు రెండేళ్ల నిషేధం కూడా విధించింది. ఆరోజు హృదయం ముక్కలుపారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కష్టపడి ఒక్కో విజయంతో ఫైనల్‌కు చేరింది. ఓడినా కనీసం రజతం ఖాయమనుకుంటే... స్వర్ణ పతక పోరుకు నిమిషాల ముందు ఆమె కేవలం 100 గ్రాముల అధిక బరువుతో బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. ఇది ఆమెనే కాదు భారత క్రీడాలోకానికే గుండె పగిలినంత పనైంది.


