
27లోపు వివరణ ఇవ్వాలన్న భారత రెజ్లింగ్ సమాఖ్య
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అధిక బరువుతో అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ వేదికగా జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి అమన్ సెహ్రావత్ అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడాల్సిన అమన్... నిర్ణీత బరువుకంటే 1700 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు అతడిని పోటీ నుంచి తొలగించారు.
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధిస్తాడని భావించిన అమన్ ఇలా అర్ధాంతరంగా వైదొలగడంపై డబ్ల్యూఎఫ్‌ఐ ఆగ్రహంగా ఉంది. ఈ పోటీలకు భారత్ నుంచి నలుగురు కోచ్‌లు వెళ్లగా... వారెవరూ అమన్ నిర్ణీత బరువు కొనసాగించడంలో తోడ్పాటు అందించకపోవడంతో సమాఖ్య వారికి కూడా నోటీసులిచ్చింది. ‘ఇది ఆమోదనీయం కాదు. దీని వెనక ఉన్న కారణాలను వెలికితీయాలి. రెండు నెలల వ్యవధిలో మన అత్యుత్తమ రెజ్లర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. అందుకే అమన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశాం’ అని డబ్యూఎఫ్‌ఐ అధికారి తెలిపారు.
చీఫ్ కోచ్ జగ్‌మందర్ సింగ్, వినోద్, వీరేందర్, నరేందర్‌లను కూడా దీనిపై వివరణ ఇవ్వాలని సమాఖ్య కోరింది. ‘జాగ్రెబ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి మొత్తం 10 మంది రెజ్లర్లు, నలుగురు కోచ్‌లు వెళ్లారు. టోర్నీకి 15 రోజుల ముందే అక్కడికి చేరుకున్నారు. రెజ్లర్లందరూ తమ బరువును క్రమపద్ధతిలో ఉండే విధంగా చూసుకోవడం కోచ్‌ల కర్తవ్యం. అందుకే వారు కూడా దీనికి బాధ్యులే’ అని ఆ అధికారి వెల్లడించారు. సెలక్షన్ ట్రయల్స్ సమయం నుంచే బరువు విషయంలో పకడ్బందీగా ఉండాలని సమాఖ్య భావిస్తోంది.
రెండు కేజీల వెసులుబాటు అంశాన్ని పక్కనపెట్టి నిర్దిష్టమైన బరువు కొనసాగించే విధంగా రెజ్లర్లకు ముందు నుంచే శిక్షణ ఇవ్వాలని అనుకుంటోంది. ‘మేము ఇప్పటికే కొంతమంది కోచ్‌లతో ఈ విషయాన్ని చర్చించాం. ఇలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని చెప్పాం. అది అలవాటుగా మారిపోయి... ప్రధాన పోటీలకు మందు తక్కువ సమయంలో బరువు తగ్గించుకోవాల్సి రావడంతో రెజ్లర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. త్వరలో జరగనున్న అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌లో నిర్దిష్ట బరువును మాత్రమే అనుమతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
వచ్చే నెల 20 నుంచి సెర్బియా వేదికగా అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుండగా... దానికి ముందు లక్నో వేదికగా అక్టోబర్ 4, 5న ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇటీవల అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి ఓవర్ వెయిట్ కారణంగా అనర్హతకు గురైన యువ రెజ్లర్ నేహా సాంగ్వాన్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్ వేటు వేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఇలాగే 100 గ్రాముల అధిక బరువుతో పతకం కోల్పోయిన విషయం తెలిసిందే.