సభా హక్కుల కమిటీని నిలదీసిన హైకోర్టు
‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి వ్యక్తిగత హాజరు వాయిదా
సభా హక్కుల కమిటీ నోటీసులపై అదనపు వివరాల సమర్పణకు వెసులుబాటు
‘సాక్షి’ కథనం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో, రాదో ముందు తేల్చాలిగా?
సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉండాలి
సభా హక్కుల ఉల్లంఘన నిర్ధారణకు ముందే నోటీసులు ఎలా ఇస్తారు?
నిర్ధారణ తర్వాతే కదా.. నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సింది?
అవి లేనప్పుడు పిటిషనర్లకు ఎలా నోటీసులిస్తారు?.. సాక్ష్యాలు ఇవ్వాలని, సాక్ష్యం చెప్పాలని ఎలా కోరుతారు?.. వ్యక్తిగత హాజరుకు ఎలా నోటీసులిస్తారు?
అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, సభా హక్కుల కమిటీని ప్రశ్నించిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: సభా హక్కుల ఉల్లంఘన పేరుతో ‘సాక్షి’పై కక్షసాధింపులకు పాల్పడుతున్న అసెంబ్లీ వర్గాలకు హైకోర్టు మరోసారి గట్టి షాక్‌నిచ్చింది. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడంపై కథనాన్ని ప్రచురించినందుకు ‘సాక్షి’ని లక్ష్యంగా చేసుకోవడంపై కళ్లెం వేసింది. కథనం తాలూకు ఆధారాలతో ఈ నెల 21న సభా హక్కుల కమిటీ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పాలంటూ ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఈ నెల 11న జారీ చేసిన లేఖ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది.
సభా హక్కుల కమిటీ ముందు ధనంజయరెడ్డి, ఫణికుమార్ వ్యక్తిగత హాజరును వాయిదా వేసింది. అదనపు వివరాలను కమిటీ ముందు ఉంచేందుకు వారిద్దరికీ వెసులుబాటు ఇచ్చింంది. అసలు ‘సాక్షి’ కథనం సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తేల్చకుండా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, సభా హక్కుల కమిటీని ప్రశ్నించింది.
అన్ని అంశాలపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.కోట్ల ప్రజాధనం వృథాపై ‘సాక్షి’ కథనం
ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల నిర్వహణలో సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడంతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయింది. రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించేలా శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు.
కానీ, లోక్‌సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో ఖర్చంతా వృథా అయింది. ఆ విషయాన్నే చెబుతూ ‘కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన ఫిబ్రవరి 22న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో కంగుతిన్న అధికార పార్టీ నేతలు కక్షసాధింపు చర్యలు చేపట్టారు.
సభా హక్కుల కమిటీకి నివేదించిన స్పీకర్
‘సాక్షి’ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. ఆ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ‘సాక్షి’కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ఎడిటర్ ధనంజయరెడ్డి, ఫణికుమార్ జూన్‌లో హైకోర్టులో పిటిషన్లు వేశారు.
ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ విచారణ జరిపారు. ఇచ్చింది షోకాజ్ నోటీసు మాత్రమేనని, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి అంటూ వాటిని కొట్టివేస్తూ ఈ నెల 4న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ధనంజయరెడ్డి, ఫణికుమార్ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.
ప్రజాధనం వృథా అనే చెప్పాం.. సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదు
వారి అప్పీళ్లపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి, వేలూరు మహేశ్వర్‌రెడ్డి, అనూప్ కౌషిక్ వాదనలు వినిపించారు. ‘‘అసలు సాక్షి కథనం సభా హక్కుల పరిధిలోకి రాదు. అది కేవలం పరిపాలనాపరమైన అంశానికి సంబంధించినది. ఆ కథనం సభ్యుల హక్కులకు భంగం కలిగించడం లేదు. కాబట్టి సభా హక్కుల పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న విషయం తేల్చాల్సిన అవసరం ఉంది.
వాస్తవానికి ఏది సభా హక్కుల పరిధిలోకి వస్తుంది? ఏది రాదు..? అన్న విషయమై ఎక్కడా నిర్దిష్టమైన నిర్వచనం లేదు’’ అని మనోహర్‌రెడ్డి తెలిపారు. ‘సాక్షి’ కథనాన్ని చదివి వినిపించారు. ‘‘అసెంబ్లీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నప్పుడు, వాటిని అడ్డుకున్నప్పుడే సభా హక్కుల ఉల్లంఘన తెరపైకి వస్తుంది. సాక్షి కథనం ఎక్కడా సభా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదు. శిక్షణ తరగతులు నిర్వహించకపోవడంతో ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని మాత్రమే ఎత్తిచూపింది.
సాక్షికి షోకాజ్ నోటీసిచ్చే అధికార పరిధి సభా హక్కుల కమిటీకి లేదు’’ అని వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ కూడా ఇచ్చినా, దానిని సభా హక్కుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాక తాము ప్రచురించిన కథనానికి తగిన ఆధారాలతో స్వయంగా ఈ నెల 21న హాజరై సాక్ష్యం ఇవ్వాలంటూ కమిటీ తరఫున అసెంబ్లీ జనరల్ సెక్రటరీ లేఖ పంపారని పేర్కొన్నారు.
కమిటీ ఎదుట హాజరైతే దోషులుగా తేల్చేస్తారు
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘‘సభా హక్కుల కమిటీ ఇచ్చిన నోటీసులకు స్పందించండి. కమిటీ ముందు హాజరుకండి. మీరు చెప్పాల్సింది చెప్పండి. మీకు వ్యతిరేకంగా కమిటీ ఉత్తర్వులిస్తే మా వద్దకు రండి. అప్పుడు తప్పకుండా మేం స్టే ఇస్తాం’’ అని ప్రతిపాదించింది. దీనిపై మనోహర్‌రెడ్డి స్పందిస్తూ, వార్తా కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా? రాదా? అన్నది తేలకుండా పిటిషనర్లు కమిటీ ఎదుట హాజరు కావడంలో అర్థం లేదని.. ఒకవేళ వారు హాజరైతే వెంటనే విచారణ మొదలుపెట్టి దోషులుగా తేలుస్తారని తెలిపారు.
సభా హక్కుల ఉల్లంఘనఅని దేని ఆధారంగా నిర్ధారణకు వచ్చారు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్, సభా హక్కుల కమిటీ తరఫున గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. సహజ న్యాయ సూత్రాల్లో భాగంగా పిటిషనర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన అని దేని ఆధారంగా నిర్ధారణకు వచ్చారంటూ వరుసగా ప్రశ్నలు సంధించింది.
దమ్మాలపాటి స్పందిస్తూ సభా హక్కుల ఉల్లంఘన విషయంలో సభా హక్కుల కమిటీ తన నివేదికను సభకు ఇస్తుందని, ఈ నివేదిక తుది నిర్ణయం కాదన్నారు. పిటిషనర్లు తప్పు చేశారా లేదా అన్నది సభే నిర్ణయిస్తుందన్నారు. నోటీసులకు స్పందించి అదనపు వివరాలు ఇవ్వొచ్చని, సాక్ష్యం ఇవ్వాలన్న బలవంతం కానీ, నిబంధన కానీ ఏమీ లేదన్నారు.
ఉల్లంఘన తేల్చకుండా పిటిషనర్లను విచారించడం సరికాదు
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సాక్షి కథనం సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో తేల్చకుండా పిటిషనర్లను విచారించడం సరికాదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ల వివరణను కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని వారి తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున సభా హక్కుల కమిటీ ఎదుట పిటిషనర్ల వ్యక్తిగత హాజరును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కమిటీకి అదనపు వివరాలు ఉంటే వాటిని సమర్పించవచ్చునని పిటిషనర్లకు సూచించింది.


