సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కుత్తడి తిరుపతిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
ఆలయ గోపురం ఎక్కి.. తాను కోరినంత మద్యం ఇవ్వకుంటే కలశాలను ధ్వంసం చేస్తానంటూ హల్‌చల్ చేశాడు కుత్తడి తిరుపతి. జనవరి 2 రాత్రి ఏకాంత సేవ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో భక్తులతోపాటే లోనికి చొరబడిన తిరుపతి.. ఆలయం మూసేశాక కర్ర ఏర్పాట్ల మీదుగా ఆలయ గొపురం ఎక్కాడు. విజిలెన్స్ సిబ్బంది నిద్రమత్తులో ఈ విషయం గమనించలేదని తెలుస్తోంది.
అయితే.. ఆ తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తిరుపతిని దిగమని ఎంత బతిమాలినా వినలేదు. చివరకు.. 3 గంటలపాటు శ్రమించి నిచ్చెన సాయంతో బలవంతంగా అతన్ని కిందకు తీసుకొచ్చారు. అయితే కిందకు దిగిన తిరుపతి తొలుత తనను చంపేస్తారని బెదిరించారని.. అందుకే పైకి ఎక్కానంటూ పొంతన లేని మాటలు మాట్లాడాడు. అయితే..
మద్యం మత్తులోనే అతను ఈ అపచారానికి పాల్పడ్డాడని.. ఆధార్ కార్డ్‌ను బట్టి నిజామాబాద్‌కు చెందిన వ్యక్తిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పీఎస్‌కు తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ నెల 12వ తేదీ దాకా రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలు కు తరలించారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ సేవల్లో తరలిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదని.. పైగా వరుస అపచారాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఉండడం లేదని.. ఒక తాగుబోతు ఆలయ గోపురం మీదకు ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే విజిలెన్స్ నిఘా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని.. మరి ముఖ్యంగా సనాతనం గురించి మాట్లాడే పవన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


