మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే 0–3తో కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్ రిసార్ట్‌కు వెళ్లిన ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ప్రకటించారు. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చాలా ఎక్కువగా తాగేసిన అతను దారి తప్పినట్లుగా ఇందులో కనిపిస్తోంది. తిరిగి ఎలా వెళ్లాలో తెలుసా అంటూ ఒక మహిళ ప్రశ్నించగా ‘తెలీదు’ అంటూ డకెట్ జవాబిచ్చాడు. దీంతో పాటు మరో ఆటగాడు జాకబ్ బెెతెల్ క్లబ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. రెండో టెస్టులో పరాజయం తర్వాత మళ్లీ కొత్తగా ఉత్తేజం పొంది సిద్ధం అయ్యేందుకు వీలుగా అంటూ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నాలుగు రోజుల పాటు ఈ రిసార్ట్ ప్రణాళికను రూపొందించాడు.
ఈ సెలవు తర్వాత జట్టుపై ఎలాంటి విమర్శలు రాలేదు కానీ మూడో టెస్టులో ఓడి యాషెస్ కోల్పోవడంతో వారి షికారుపై చర్చ మొదలైంది. రిసార్ట్‌లో అంతా బాగా ప్రవర్తించారు అంటూ మొదట్లో ప్రకటించిన రాబ్ కీ...కారణాలు ఏమైనా అంతర్జాతీయ క్రికెటర్లు పరిమితికి మించి మద్యం తీసుకోవడం మంచిది కాదని, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పాడు.
యాషెస్ ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి డకెట్ మొత్తం 97 పరుగులే చేశాడు. 2017లో ఆ్రస్టేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా సీనియర్ ప్లేయర్ జిమ్మీ అండర్సన్‌పై మద్యం ఒలకబోయడంతో డకెట్‌ను సస్పెండ్ చేసిన ఈసీబీ వెంటనే స్వదేశానికి పంపించేసింది.
ఆర్చర్ అవుట్...
యాషెస్ కోల్పోయి మిగతా మ్యాచ్‌లలో పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుపై మరో దెబ్బ పడింది. టీమ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల గాయంతో సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. శుక్రవారం జరిగే నాలుగో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్‌కు చోటు దక్కింది. ప్రధాన బ్యాటర్ ఒలీ పోప్‌పై కూడా ఈ మ్యాచ్‌లో వేటు పడింది.
తాజా యాషెస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 125 పరుగులే చేసిన పోప్ గత 16 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. పోప్ స్థానంలో జాకబ్ బెతెల్‌ను టీమ్‌లోకి ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తరఫున బెతెల్ ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడాడు.


