భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి, బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డును అందుకోనున్నారు. అవార్డుల ఎంపిక కోసం నియమించిన కమిటీ 24 మంది పేర్లను సిఫారసు చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన గాయత్రి, శ్రీకాంత్‌లకు చోటు దక్కింది. ఈ జాబితాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర వేయడం లాంఛనమే.
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె అయిన 22 ఏళ్ల గాయత్రి కొన్నేళ్లుగా మహిళల డబుల్స్‌లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో రజత, కాంస్యాలు గెలిచిన భారత జట్లలో సభ్యురాలైన ఆమె...భాగస్వామి ట్రెసా జాలీతో కలిసి నాలుగు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలు గెలిచింది.
మరో నాలుగు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 23 ఏళ్ల ధనుశ్ శ్రీకాంత్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ కప్‌లో స్వర్ణంతో వెలుగులోకి వచ్చాడు. 2021, 2025 డెఫ్ ఒలింపిక్స్‌లలో కలిపి అతను మొత్తం 4 స్వర్ణాలు సాధించాడు.


