యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నిర్వహించిన యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ విజయవంతంగా ముగిసింది. జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నీలో... 7 నుంచి 15 ఏళ్ల విభాగాల్లో వేర్వేరుగా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన ప్రాథమిక రౌండ్‌లలో సత్తాచాటిన 500 మంది అథ్లెట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.
బాలికల అండర్–15 విభాగంలో సత్యం ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన వర్ష ప్రథమ బహుమతి దక్కించుకోగా... సాహితి (ఎంఎన్‌ఆర్ హై స్కూల్), పర్విన్ జేబా (అంబర్‌పేట్ గవర్నమెంట్ హై స్కూల్) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. బాలికల అండర్–14 విభాగంలో నాగార్జున గ్రామర్ హై స్కూల్‌కు చెందిన శ్రీజెనా మొదటి స్థానం దక్కించుకోగా... ప్రణవి (శ్లోక స్కూల్), భువనేశ్వరి (కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్) రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు.
బాలుర అండర్–15 విభాగంలో గంగోత్రి పబ్లిక్ స్కూల్‌కు చెందిన శ్రీకాంత్ అగ్రస్థానంలో నిలవగా... సమీర్ హుసేన్ (బ్రైట్ కాన్సెప్ట్ హైస్కూల్), రాహుల్ శెట్టి (గౌతమి టెక్నో స్కూల్) వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.
అండర్–14 విభాగంలో పల్లవి మోడల్ స్కూల్‌కు చెందిన హర్షిత్ మొదటి స్థానం దక్కించుకోగా... మొహమ్మద్ అయాన్ ఖాన్ (పల్లవి మోడల్ స్కూల్), సూరజ్ కుమార్ (సెయింట్ థామస్ హై స్కూల్) వరుసగా రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. విజేతలకు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు.


