ధార్వాడ్: కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్‌కు గురయ్యారని అనుమానించారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.
పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.


