‘మరుగుజ్జు’ ఉదంతంపై బవుమా స్పష్టీకరణ
జొహన్నెస్‌బర్గ్: భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో తన ఎత్తు విషయంలో ఎదుర్కొన్న వ్యాఖ్య గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్ బుమ్రా, కీపర్ రిషభ్ పంత్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ విషయంలో చర్చించుకుంటూ బవుమా గురించి ‘మరుగుజ్జు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొంత వివాదం రేగింది. అయితే ఆ తర్వాత వారిద్దరు తనకు క్షమాపణలు చెప్పారని బవుమా స్పష్టం చేశాడు.
నిజానికి ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో కూడా తనకు తెలీదని అతను వెల్లడించాడు. ‘నిజానికి బుమ్రా, పంత్ నన్ను క్షమాపణలు కోరినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం కాలేదు. మా మీడియా మేనేజర్‌ను అడిగి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. వారి భాషలో నా గురించి ఏదోలా మాట్లాడుకున్నారని అర్థమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత నా వద్దకు వచ్చి వారు సారీ చెప్పారు.
మైదానంలో జరిగిన విషయాలు అక్కడే ముగిసిపోతాయి. కానీ ఏం అన్నారో మర్చిపోలేం కదా. అవి మరింత బాగా ఆడేందుకు ప్రేరణ అందిస్తాయి. అయితే నాకు ఎలాంటి విద్వేషభావం లేదు’ అని బవుమా వివరించాడు. మరోవైపు గువాహటిలో జరిగిన రెండో టెస్టు సమయంలో భారత ఆటగాళ్లను ‘మోకాళ్లపై కూర్చోబెడతాను’ అంటూ దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ అనడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ విషయంలో షుక్రిని తప్పుబట్టిన బవుమా... అతను మరింత మెరుగైన భాషను వాడాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత గడ్డపై కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించానని...వాటిని అధిగమించి 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం చాలా గొప్పగా అనిపించిందని బవుమా తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు.


