న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త సెలక్షన్ పాలసీని తీసుకొచి్చంది. సమాఖ్య ఏర్పాటు చేసే జాతీయ శిక్షణ శిబిరాలకు హాజరైన వారినే ఇక మీదట భారత జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఇకపై శిబిరాల్లో క్రమం తప్పకుండా పాల్గొన్న వారినే ఎంపిక కోసం పరిగణిస్తామని, శిబిరాలను బేఖాతరు చేసే రెజ్లర్లను భారత జట్టుకు ఎంపిక చేయబోమని డబ్ల్యూఎఫ్‌ఐ ప్రకటించింది. అహ్మదాబాద్‌లో ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ జనరల్ కౌన్సిల్‌లో జరిగిన సుదీర్ఘ చర్చలో ఇదే విషయాన్ని కౌన్సిల్ సభ్యులు కూడా సూచించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి ఒకరు వెల్లడించారు.
నో క్యాంప్... నో జెర్సీ!
ఎలైట్ రెజ్లర్లయినా, ఐకానిక్ ఆటగాళ్లయినా, ఒలింపిక్ పతక విజేతలు ఎవరైనా సరే జాతీయ శిక్షణ శిబిరాలకు రావాల్సిందే. శిబిరాలకు ఎంపికైన రెజ్లర్లు డబ్ల్యూఎఫ్‌ఐ ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్‌లో కచి్చతంగా పాల్గొనాలి. వ్యక్తిగతంగా మరో చోట శిక్షణ తీసుకుంటామంటే కుదరదు. సాకులతో శిబిరాలకు గైర్హాజరయ్యే రెజ్లర్లు ఎంతటి వారైనా సరే భారత జట్టుకు ఎంపిక చేయనే చేయరు. శిబిరాలకు ప్రాధాన్యత ఇచ్చి కోచ్ మార్గదర్శనంలో శిక్షణ పొందిన, అర్హత గల రెజ్లర్లకు మాత్రమే భారత టీమ్ జెర్సీ (బెర్తు) లభిస్తుంది.
ట్రయల్స్ ‘పోటీ’తోనే అంతర్జాతీయ ఈవెంట్లకు...
అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడాలనుకునే రెజ్లర్లు ఇక మీదట తప్పనిసరిగా సెలక్షన్ ట్రయల్స్‌లోనూ పోటీపడాల్సి
ఉంటుంది. గత పతక ఘనతలు, ర్యాంకింగ్‌ను ఏమాత్రం పరిగణించరు. కేవలం ప్రస్తుత ఫామ్, సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటితేనే భారత జట్టుకు ఎంపిక చేస్తారు.


