న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కింది కోర్టు ప్రొసిడింగ్స్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని పిటిషనర్ తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎంపీ కూడా అయిన బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన దీక్ష చేపట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీం’ కల్పించుకోవడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు 2023, మే నెలలో అప్పటి అధికారపార్టీ ఎంపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఏడాది తర్వాత 2024, మే 21న ట్రయల్ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల అణచివేత అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. దీనిపై అదే ఏడాది బ్రిజ్‌భూషణ్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో తనకు అనుకూలంగా స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తిరస్కరించింది.
ఈ సందర్భంగా కింది కోర్టులో ఎప్పుడో విచారణ మొదలైందని, ఈ కేసు ప్రొసిడింగ్స్‌లో తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరంగానీ, స్టే ఇవ్వాల్సిన అవసరం గానీ లేవని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రయల్ కోర్టులో ఏప్రిల్ 21న తదుపరి విచారణ జరగనుంది.


