‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’ | Sunil Gavaskar Warns SunRisers Of Boycott After Abrar Ahmed Deal | Sakshi
Sakshi News home page

‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’

Mar 16 2026 3:01 PM | Updated on Mar 16 2026 4:22 PM

Sunil Gavaskar Warns SunRisers Of Boycott After Abrar Ahmed Deal

హండ్రెడ్‌ మెన్స్‌ టీ20 టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌  పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వేలంలో అబ్రార్‌ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. 

అయితే పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్‌ మీడియాలో భారత మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు సంబంధించి ‘ఎక్స్‌’ ఖాతాను కూడా సస్పెండ్‌ చేయడం గమనార్హం. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా సన్‌రైజర్స్‌ పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘ది హండ్రెడ్‌ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ భారత్‌కు చెందిన ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాళ్లను తీసుకోవడం నచ్చడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణించడంతో ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. 

ఆ తర్వాత ఐపీఎల్‌ వేలంలోనూ పాక్‌ ఆటగాళ్లను విస్మరించడం జరిగింది. ఐపీఎల్‌ 2008 సీజన్‌ మినహా పాక్‌ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్‌లో కనిపించలేదు. కానీ తాజాగా సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. 

సదరు ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాడికి ఫీజు రూపంలో చెల్లించే డబ్బులను అతడు తన దేశానికి పన్నుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోనే పాక్‌ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది. ఆ ఆయుధాలే ఇవాళ మన భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. 

దీంతో తెలిసీ తెలియకో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఒక రకంగా ప్రాణనష్టానికి పాల్పడుతున్న దేశంతో సంబంధం కొనసాగిస్తున్నట్లే అవుతుంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఈ ఆగ్రహం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.’ అని చెప్పుకొచ్చారు. 

మరోవైపు బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా మాత్రం.. ‘ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్‌. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము’ అని పేర్కొన్నారు.కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. 

తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా మార్చారు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌ గతేడాది చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది.

చదవండి: న‌డ‌వ‌లేని స్థితిలో టీమిండియా స్టార్‌ క్రికెట‌ర్‌.. వీడియో

Advertisement
 
Advertisement
Advertisement