‘తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు’ అనే సామెత ఇప్పుడు చెప్పుకునే విషయానికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ 16 వరుస విజయాలకు మెద్వదెవ్ చెక్ పెడితే, మెద్వదెవ్ 9 వరుస విజయాలకు తాజాగా సిన్నర్ అడ్డుకట్ట వేశాడు.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ఏటీపీ 1000 టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విజేతగా ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ నిలిచాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన సిన్నర్ 7-6(8/6), 7-6(7/4)తో రష్యాకు చెందిన డానిల్ మెద్వదెవ్‌పై విజయాన్ని అందుకున్నాడు.
సిన్నర్ కెరీర్‌లో ఇదే తొలి ఇండియా వెల్స్ మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. కాగా నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన సిన్నర్‌కు 2026 ఏడాదిలో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని సిన్నర్ ఫైనల్లోనూ దానిని కొనసాగించినప్పటికీ, మ్యాచ్‌లో రెండు సెట్లు టైబ్రేక్‌కు దారి తీశాయి.
గంటా 55 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌లో మెద్వదెవ్, సిన్నర్‌లు హోరాహోరీగా తలపడడంతో సెట్ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్ 8 పాయింట్లతో సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీయడం, ఆ సెట్‌లోనూ సిన్నర్‌దే పైచేయి సాధించడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

సబలెంకా జోరు..
మరోవైపు మహిళల సింగిల్స్‌లో బెలారస్ బ్యూటీ ఎరీనా సబలెంకా విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో సబలెంకా 3-6, 6-3, 7-6(8/6)తో ఎలీనా రిబాకినాపై విజయాన్ని అందుకొని కెరీర్‌లో తొలి ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.


