
జాగ్రెబ్ (క్రొయేషియా): స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమైన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఈ రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు. తన వెయిట్ కేటగిరీలో అధిక బరువు వల్లే అతను ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. సాధారణంగా.. పోటీలకు ముందు రెజ్లర్‌కు బరువును (వెయింగ్) చూస్తారు.
1.7 కేజీలు అధిక బరువు
పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో తలపడేందుకు సిద్ధమైన అమన్ ఉండాల్సిన బరువుకంటే ఏకంగా 1.7 కేజీలు (1700 గ్రాములు) అధిక బరువు ఉండటంతో నిర్వాహకులు డిస్‌క్వాలిఫై చేశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. అమన్‌లాంటి రెజ్లర్ తన బరువును అదుపులో ఉంచుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
బరువును తూచే వెయింగ్ మిషిన్‌పై అతను నిలబడితే 1.7 కేజీలు అధికంగా ఉన్నట్లు కనిపించింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అతను అంత బరువు ఎలా పెరిగాడో అర్థమవడం లేదు’ అని జాగ్రెబ్‌లో ఉన్న భారత జట్టు అధికారి ఒకరు వెల్లడించారు.
100 గ్రాములు ఎక్కువ ఉన్నా
కాగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం ప్రపంచకప్, ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో ఉండాల్సిన బరువు కంటే రెండు కేజీల అదనపు బరువును కూడా అనుమతిస్తారు. అయితే ప్రపంచ చాంపియన్ షిప్, ఒలింపిక్స్‌లాంటి మెగా టోర్నీల్లో మాత్రం 100 గ్రాములున్నా వెంటనే అనర్హత వేటు వేస్తారు.
నెల వ్యవధిలోనే
గత నెల 25నే అమన్ జాగ్రెబ్‌కు చేరుకున్నాడు. పలువురు భారత రెజ్లర్లతో కలిసి ఈవెంట్ కోసం ముమ్మరసాధనలో నిమగ్నమయ్యాడు. కానీ ఇంత చేసీ కీలకమైన బరువును అదుపులో ఉంచుకోవడంలో విఫలమయ్యాడు.
నెల వ్యవధిలోనే భారత బృందానికి ఇది రెండో డిస్‌క్వాలిఫై! మహిళా రెజ్లర్ నేహా సాంగ్వాన్ (59 కేజీల కేటగిరీ) గత నెల బల్గేరియాలో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 600 గ్రాములు అధిక బరువు వల్ల అనర్హతకు గురైంది.
నిజానికి ఆమె తాజాగా క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో కూడా పాల్గొనేందుకు సీనియర్ జట్టుకు ఎంపికైంది. అయితే బరువు నియంత్రణలో పదేపదే నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను భారత రెజ్లింగ్ సమాఖ (డబ్ల్యూఎఫ్‌ఐ) ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాటు రెండేళ్ల నిషేధం కూడా విధించింది.
ఆరోజు హృదయం ముక్కలు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కష్టపడి ఒక్కో విజయంతో ఫైనల్‌కు చేరింది. ఓడినా కనీసం రజతం ఖాయమనుకుంటే... స్వర్ణ పతక పోరుకు నిమిషాల ముందు ఆమె కేవలం 100 గ్రాముల అధిక బరువుతో బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయింది. ఇది ఆమెనే కాదు భారత క్రీడాలోకానికే గుండె పగిలినంత పనైంది.