సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అంతర్ యూనివర్సిటీ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వ్రిత్తి అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో సత్తా చాటిన వ్రిత్తి... చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది.
మహిళల 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో శుక్రవారం వ్రిత్తి 18 నిమిషాల 1.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకుంది. విశ్వేశ్వర టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన షీరీన్ (18 నిమిషాల 10.97 సెకన్లు) రజత పతకం గెలుచుకోగా... అశ్విత చంద్ర (18 నిమిషాల 24.11 సెకన్లు; జైన్ యూనివర్సిటీ బెంగళూరు) కాంస్య పతకం సాధించింది.


