ప్రపంచ చాంపియన్‌పై విజయం
ఫైనల్లో ఎనిమిది మంది భారత బాక్సర్లు
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ నేడు నిఖత్ జరీన్ బౌట్
గ్రేటర్ నోయిడా: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ ప్రీతి పన్వర్ సంచలన విజయం నమోదు చేసుకుంది. మహిళల 54 కేజీల విభాగంలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ)ను ప్రీతి చిత్తు చేసింది. మంగళవారం ప్రీతితో పాటు మరో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. 22 ఏళ్ల ప్రీతి బౌట్ ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది.
చైనీస్ తైపీ బాక్సర్‌ను కోలుకోనివ్వకుండా వరుస పంచ్‌లతో పాయింట్లు సాధించింది. ‘హువాంగ్ వెన్ ప్రపంచ చాంపియన్ అనే విషయం తెలుసు. వరల్డ్ చాంపియన్‌గా ఎదగాలంటే చాంపియన్‌లను మట్టికరిపించాల్సిందే. అదే ఆలోచనతో బౌట్‌లో అడుగుపెట్టా. వంద శాతం కష్టపడ్డా. సొంత అభిమానుల మధ్య విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తా’ అని ప్రీతి వెల్లడించింది.
ఇతర బౌట్‌లలో అరుంధతి చౌదరీ, మీనాక్షి హుడా, అభినాశ్ జమ్వాల్, అంకుష్ పంఘాల్, నుపుర్ షెరాన్, నరేందర్ బెర్వాల్, పర్విన్ కూడా విజయాలతో ఫైనల్‌కు చేరారు. లియోనీ లెర్‌పై అరుంధతి విజయం సాధించగా... ప్రపంచ చాంపియన్ మీనాక్షి (48 కేజీలు) 5–0తో బాక్ చొ రాంగ్ (కొరియా)పై గెలుపొందింది. ఎల్విన్ అలీవ్ (ఉక్రెయిన్)పై అభినాశ్ (65 కేజీలు), డానియల్ (కజకిస్తాన్)పై నరేందర్ (90+కేజీలు) విజయాలు సాధించారు.
80 కేజీల విభాగంలో అంకుష్ 5–0తో మార్లోన్ సెవెహోన్ (ఆస్ట్రేలియా)పై గెలవగా... 80+కేజీల విభాగంలో నుపుర్... ఉక్రెయిన్ బాక్సర్ మారియా లవ్‌చిన్‌స్కాను చిత్తు చేసింది. పర్విన్ 3–2 తేడాతో అనెటా ఎల్‌బిటా (పోలాండ్)పై నెగ్గింది. సవీటి బూరా (75 కేజీలు) ఆ్రస్టేలియా బాక్సర్ ఎమ్మా సూ గ్రీన్‌ట్రీ చేతిలో ఓడగా... నవీన్ కాంస్య పతకంతో టోర్నమెంట్‌ను ముగించాడు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) నేడు బరిలోకి దిగనుంది.


