- భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపిక
- నాలుగున్నరేళ్ల తర్వాత మరోసారి బాధ్యతలు
న్యూఢిల్లీ: నెదర్లాండ్స్‌కు చెందిన జోయెర్డ్ మరీన్‌కే భారత మహిళల హాకీ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పారు. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మళ్లీ చీఫ్ కోచ్‌గా 51 ఏళ్ల నెదర్లాండ్స్ మాజీ ఆటగాడిని నియమిస్తున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. ఆయన కోచింగ్‌లోనే 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తృటిలో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత చీఫ్ కోచ్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోగా... గత పారిస్ ఒలింపిక్స్‌కు అసలు అర్హతే సాధించలేకపోయింది. ఆ తర్వాత కూడా మహిళల జట్టు పరిస్థితిలో ఏ మార్పూ లేదు. నానాటికీ తీసికట్టుగా పడిపోతూనే వచి్చంది. కానీ పురోగతి కనిపించలేదు. దీంతో జట్టు వైఫల్యాలకు, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హరేంద్ర సింగ్ డిసెంబర్‌లో తన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు.
నిజానికి ఆయన ఒంటెద్దు పోకడలు కూడా కారణమని, అందుకనే రాజీనామాతో తప్పుకునేలా చేశారని వార్తలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మరీన్ అండ్ టీమ్‌నే తీసుకురావాలని హెచ్‌ఐ నిర్ణయించింది. జోయెర్డ్ మరీన్ బృందంలో అప్పటి మథియస్ విల (అనలిటికల్ కోచ్), వేన్ లాంబార్డ్ (సైంటిఫిక్ అడ్వైజర్)గా ఉంటారు. ‘మరోసారి భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా రానుండటం సంతోషంగా ఉంది. కొత్త ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో ప్లేయర్లు రాణించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని మరిన్ అన్నారు.
అప్పుడు ఐదేళ్లు సేవలు...
నెదర్లాండ్స్‌కు చెందిన మాజీ ఫీల్డ్ హాకీ ప్లేయర్ జోయెర్డ్ మరీన్ గతంలోనూ భారత హాకీ జట్టుకు కోచ్‌గా సేవలందించారు. 2017 నుంచి 2021 వరకు ఐదేళ్ల పాటు ఆయన మహిళల హాకీ కోచింగ్ బాధ్యతలు చక్కబెట్టారు. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు చక్కని ఫలితాలు అందించారు. ఆయన కృషి వల్లే పతకం రాకపోయినా మెరుగైన నాలుగో స్థానంతో హాకీ జట్టు సంతృప్తి చెందింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి ఎగబాకింది. ఇంటా బయటా పలు టోరీ్నల్లోనూ రాణించింది. కుటుంబ కారణాలతో కోచింగ్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన ఇక్కడి (భారత్) నుంచి వెళ్లిపోయారు.
గాయాలు... వైఫల్యాలు...
టోక్యో ఈవెంట్‌లో రాణి రాంపాల్ సేన రాణించింది. కానీ తదనంతరం ఆమెతో పాటు పలువురు సీనియర్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అప్పటిదాకా నాణ్యమైన కోచింగ్ ఇచ్చిన మరీన్ వెనుదిరగడంతో ఒక్కసారిగా సరైనా మార్గదర్శనం కూడా కొరవడింది. 2022 కామన్వెల్త్ క్రీడలు, 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు తెచి్చనప్పటికీ ఆ తర్వాత జట్టు చెప్పుకోదగిన విజయాలే సాధించలేదు. గతేడాది అయితే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో 16 మ్యాచ్‌లాడి రెండే విజయాలతో అట్టడుగుకు పడిపోయింది. ఆసియా కప్‌లో రజతం నెగ్గినప్పటికీ ఈ ఆగస్టులో జరిగే ప్రపంచకప్‌కు ఆ ప్రదర్శన అర్హతను తెచి్చపెట్టలేకపోయింది.
ఇప్పుడున్న సవాళ్లు...
మరీన్ మళ్లీ మొదటి నుంచే ప్రారంభించాలి. ఎందుకంటే అప్పుడున్నట్లుగా జట్టు లేదు. తను తీర్చిదిద్దిన రాణి రాంపాల్, వందన కటారియా, దీప్ గ్రేస్ ఎక్కాలాంటి వెటరన్ ప్లేయర్లు అందుబాటులో లేరు. వీళ్లంతా రిటైరయ్యారు. దీంతో మరిన్‌కు సవాళ్లు తప్పవు. ముందుగా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ కోసం జట్టును సన్నద్ధం చేయాలి. హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి 14 వరకు ఈ క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఇందుకోసం అమ్మాయిల జట్టుకు ఈ నెల 19 నుంచి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోటీలకు ముందు ఆయన కోచింగ్ పాఠాలు ఇక్కడే మొదలవుతాయి. సరిగ్గా ఐదు రోజుల ముందే ఈ నెల 14న మరీన్ భారత్‌కు చేరుకుంటారు. నేరుగా బెంగళూరుకు బయల్దేరి జట్టును సిద్ధం చేసే బాధ్యతలు చేపట్టనున్నారు.


