టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఉదయం (11 గంటలకు) జరిగిన పోరులో పసికూనలు నెదర్లాండ్స్, నమీబియా తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. బాస్ డి లీడ్ ఆల్‌రౌండ్ మెరుపుల కారణంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
లీడ్ తొలుత బంతితో (3-0-20-2), ఆతర్వాత బ్యాట్‌తో (48 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటి నెదర్లాండ్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ ప్రస్తుత ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఖంగుతింది. మరోవైపు నబీమియాకు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు పరాజయంపాలైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (30), జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42) ఓ మోస్తరు స్కోర్లు సాధించి నమీబియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లలో జేజే స్మిట్ (22), కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లొగన్ వాన్ బీక్, బాస్ డి లీడ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాస్సెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని నెదర్లాండ్స్ సునాయాసంగా ఛేదించింది. బాస్ డి లీడ్ అజేయమైన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. లీడ్‌తో పాటు కొలిన్ ఆకెర్‌మన్ (32), మైఖేల్ లెవిట్ (28), స్కాట్ ఎడ్వర్డ్స్ (18 నాటౌట్) కూడా రాణించడంతో నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్ స్కోల్జ్, రూబెన్ ట్రంపెల్మన్, నికోల్ లాఫ్టీకి తలో వికెట్ దక్కింది.


