మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఉదంతం మరవకముందే మరో టీమిండియా ఆటగాడు మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఇటీవల మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా యంగ్ స్టార్ సాయి సుదర్శన్ పక్కటెముక విరిగింది.
పరుగు పూర్తి చేసే క్రమంలో డైవ్ చేసిన సుదర్శన్ ప్రమాదకర రీతిలో కింద పడ్డాడు. అప్పటికి గాయం పెద్దదిగా అనిపించనప్పటికీ స్కానింగ్‌ల్లో రిబ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ గాయం కారణంగా సాయి వీహెచ్‌టీలో తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతనికి 6-8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.
సాయి ఐపీఎల్ 2026 ప్రారంభ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం. సాయి గుజరాత్ టైటాన్స్‌లో కీలక సభ్యుడు. గత కొన్ని సీజన్లుగా అతను టైటాన్స్ తరఫున స్థిరంగా రాణిస్తున్నాడు.
సాయికి ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్ట్ జట్టులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని తదుపరి టీమిండియా అవకాశాలు ఐపీఎల్ 2026 ప్రదర్శనలపై ఆధారపడి ఉంటాయి.
24 ఏళ్ల సాయి టీమిండియా తరఫున 6 టెస్ట్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 302 పరుగులు.. 3 వన్డేల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 127 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో సాయికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అరంగేట్రం నుంచి గుజరాత్ టైటాన్స్‌కే ఆడుతున్న సాయి.. 40 మ్యాచ్‌ల్లో 145కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో, కళ్లు చెదిరే 49.8 సగటున 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 1793 పరుగులు చేశాడు.


